మార్కింగ్ వేస్తే...గూడు చెదిరినట్టే

26 Jan, 2014 05:33 IST|Sakshi

 ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:  ‘వారిలాగా మేము స్థలం ఆక్రమించి ఇల్లు కట్టలేదు. మా ఇంటికి పక్కాగా రిజిస్ట్రేషన్ పత్రాలున్నాయి. మాకేమవుతుంది..?’ అని ఇప్పటిదాకా ధీమాగా ఉన్న కొందరు ఇళ్ల, స్థల యజమానులు.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఖమ్మంలోని సాగర్ కాల్వలను ఆక్రమించి నిర్మించిన గుడిసెల తొలగింపు కార్యక్రమం శనివారం పార్శీబంధం, ముస్తఫానగర్, శ్రీరామ్‌నగర్, ధంసలాపురం తదితర ప్రాంతాల్లో కొనసాగింది.

 కాల్వ సరిహద్దులను గుర్తిస్తూ, దాని పరిధిలోని ఇళ్లు, నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ వేయిస్తున్నారు. ఇలా మార్కింగ్ వేసేంతవరకు.. తమ ఇల్లు కాల్వ పరిధిలో ఉందన్న విషయం తెలియని అనేకమంది లబోదిబోమంటున్నారు. కాల్వ స్థలాలను కొందరు రియల్ వ్యాపారులు ఆక్రమించి, వాటిపై ఇళ్లు నిర్మించి, మున్సిపల్ కార్యాలయం నుంచి ఇంటి నంబర్ తీసుకుని, రిజిస్ట్రేషన్ చేయించి లక్షల రూపాయలకు విక్రయించారు. అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లల్లో కొన్నింటికి ఇప్పటికే రెండు మూడు రిజిస్ట్రేషన్లు జరిగినవి కూడా ఉన్నాయి.

 వీటిని తాము లక్షల రూపాయలకు కొన్నామని, దారుణంగా మోసపోయామని వీటి కొనుగోలుదారులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు లోనవుతున్నారు. కళ్లెదుటే గూడు చెదిరిపోతుంటే.. తట్టుకోలేక గుండె చెరువవవుతోంది. కొందరు లోలోనే కుమిలిపోతుంటే.. మరికొందరు భోరుమని విలపిస్తున్నారు. కూల్చివేతకు వచ్చిన అధికారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపిస్తూ.. ‘రియల్ వ్యాపారుల మోసానికి బలయ్యాం.

 మా కష్టార్జితమైన లక్షల రూపాయలను వారికి పువ్వుల్లో పెట్టిచ్చి... మేమేమో ఇలా రాళ్లు, ఇటుకల శిథిలాలు మిగుల్చుకున్నాం’ అంటూ, గోడు వినిపించారు. కొందరు రాజకీయ నాయకులుగా, రియల్ వ్యాపారులుగా చలామణవుతూ అనేకమంది అమాయకులను ఇలా మోసగించారన్న బాధితులు తీవ్ర ఆగ్రహావేశం వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాటి కూల్చివేతలను ఆర్డీఓ సంజీవరెడ్డి, డీఎస్పీ బాలకిషన్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్, తహశీల్దార్ ఆశోక్ చక్రవర్తి పర్యవేక్షించారు.

 గృహ ప్రవేశం జరిగి నెల కూడా కాలేదు...
 శనివారం ఇల్లు కోల్పోయిన బాధితుల్లో ఒకరి పరిస్థితి మరీ దారుణం. ఆ ఇంటి యజమాని నెల రోజుల కిందటే ఓ ఇంటిని లక్షల రూపాయలకు కొన్నారు. గృహ ప్రవేశం జరిగి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే అధికారులు వచ్చి, అది ఆక్రమిత స్థలంలో ఉందంటూ మార్కింగ్ చేసి వెళ్లారు. ఇలా ఇళ్లు కోల్పోయిన వారిలో ఛత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు కూడా ఉన్నారు.

తమ కుటుంబీకుల రెక్కల కష్టంతో ఎన్నో ఏళ్ల కిందట కొన్న ఇళ్లను కూల్చివేస్తుండడాన్ని చూస్తూ భోరున విలపించారు. కూల్చివేతను పర్యవేక్షించేందుకు వచ్చిన కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఎవి.రంగనాథ్‌కు తమ గోడు చెప్పుకుని, దిక్కెవరంటూ కన్నీటితో ప్రశ్నించారు.

 కోర్టు స్టేతో నిలిచిన తొలగింపు
 పార్శీబంధం, ముస్తఫానగర్ ప్రాంతంలో కాల్వల పరిధిలోగల కొన్ని ఇళ్ల యజమానులు ముందస్తుగా కోర్టును ఆశ్రయించి (తొలగింపు నుంచి మినహాయింపునకు) స్టే తెచ్చుకున్నారు. వీటికి సర్వే అధికారులు మార్కింగ్ చేసి, స్టే ఆర్డర్ నంబర్లు వేశారు.

>
మరిన్ని వార్తలు