అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం

10 Dec, 2023 05:54 IST|Sakshi
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీడీపీ శ్రేణులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని కత్తి పద్మారావు ఆరోపణ

పొన్నూరు:గుంటూరు జిల్లా పొన్నూరులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఓ వ్యక్తి అవమానకర చేష్టలకు దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన పట్ల దళిత సంఘా­లు, జై భీమ్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రాంతీయ గ్రంథాలయ ఉద్యోగి, టీడీపీ సాను­భూతిపరుడు ముప్పవరపు శ్రీనివాసరావు అవమానకరంగా ప్రవర్తించాడు.

దుస్తులు విప్పి.. పక్కన ఉన్న మెట్లపైకి ఎక్కి విగ్రహంపై మూత్ర విసర్జన చేశాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై దళిత సంఘాలు, జై భీమ్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. అంబేడ్కర్‌ను అవమానించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సుమారు రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంఘాల నేతలతో చర్చలు జరిపినా ఫలితం లేదు. కాగా, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు.

వారణాసిలో ఉన్న ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడారు.  అంబేడ్కర్‌ లాంటి విశిష్ట వ్యక్తు­లను అగౌరవపరిచే చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఘటనకు పాల్పడింది టీడీపీ శ్రేణులేనని దళిత మహాసభ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కత్తి పద్మారావు ఆరోపించారు. జనవరిలో విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న తరుణంలో అగ్రకులా­ల­కు చెందిన వారు ఆయనను అగౌరవపరుస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

>
మరిన్ని వార్తలు