మిత్రులే హతమార్చారు

26 Apr, 2015 01:50 IST|Sakshi

- గుప్తనిధుల తవ్వకాల కోసం యువకుడి బలి
- నిశ్శంకుదుర్గంలో దుర్ఘటన
- మిత్రులే కడతేర్చిన వైనం
- గుండెలు బాదుకున్న యువకుడి తల్లి
కార్వేటినగరం
: గుప్తనిధుల తవ్వకాల కోసం ఓ యువకుడిని మిత్రులే హతమార్చిన సంఘటన కార్వేటినగరం మండల పరిధిలోని నిశ్శంకుదుర్గంలో చోటుచేసుకుంది. దాదాపు పన్నెండు రోజుల కిందట అదృశ్యమైన అతడు శనివారం శవమై ప్రత్యక్షమయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న అతడిని తీసుకెళ్లిన మిత్రులను పోలీసులు పట్టుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది.

పోలీసుల కథనం మేరకు... పుత్తూరు పరిధిలోని గేటు పుత్తూరుకు చెందిన చిత్ర, గణేష్ దంపతుల కుమారుడు ఉదయబాబు అలియాస్ ఉదయ్‌కుమార్ (22) ఈ నెల 12న ఇంట్లో నిద్రిస్తుండగా స్నేహితులు రమేష్, చిరంజీవి వెళ్లి ఉదయ్‌కుమార్‌ను తీసుకెళ్లారు. వారితో పాటు షాజహాన్ మరో ఇద్దరు కలిసి రెండు ద్విచక్ర వాహనాల్లో కార్వేటినగరంలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఉన్న నిశ్శంకుదుర్గం ప్రాంతానికి వెళ్లారు. అందరూ కలిసి మద్యం సేవించారు. గుప్త నిధులు తవ్వకాల కోసం కోటకు వెళ్లారు. అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు ముందుగా బలిదానం చేయాలని భావించారు. మద్యం మత్తులో ఉన్న ఉదయ్‌కుమార్ గొంతుకోసి కొండపై నుంచి కిందకు తోసేశారు. ఉదయ్‌కుమార్ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు.

ఎన్నిచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దాంతో అతడిని తీసుకెళ్లిన యువకులపై అనుమానం వచ్చింది. పుత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రమేష్, చిరంజీవి, షాజహాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. శనివారం ఉదయం నిశ్శంకు దుర్గంలోని అటవీ ప్రాంతంలో కార్వేటినగరం ఎస్‌ఐ రాజశేఖర్ తదితర పోలీసులు వెళ్లి అతడి అస్థి పంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన ఉదయ్‌కుమార్ సెల్‌ఫోన్, ఇతర వస్తువులను గుర్తించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు, కార్వేటినగరం సీఐ వెంకేటేశ్వరులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడని గంపెడు ఆశతో ఉన్న తమకు  పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి వెళ్లాడని ఉదయ్‌కుమార్ తల్లి రోదిస్తోంది.

మరిన్ని వార్తలు