నేటి నుంచి ‘వైన్ స్కాన్’..!

1 Aug, 2014 01:56 IST|Sakshi
నేటి నుంచి ‘వైన్ స్కాన్’..!
  •      కంప్యూటర్ బిల్లు తప్పనిసరి
  •      స్కానర్ ఉంటేనే మద్యం స్టాకు
  •      గగ్గోలు పెడుతున్న వ్యాపారులు
  • చిత్తూరు(అర్బన్): నూతన ఎక్సైజ్ విధానం మద్యం వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలో ఆగస్టు ఒకటి (శుక్రవారం) నుంచి ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ బిల్లింగ్, మద్యం బాటిళ్లను స్కాన్ చేయడం తప్పనిసరంటూ అధికారులు నిబంధనలు విధించడంతో మద్యం దుకాణాదారులు దిగులుచెందుతున్నారు. కంప్యూటర్లు పెట్టుకోని వారికి స్టాకు ఇచ్చేదిలేదని ఎక్సైజ్ అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. ఇదే జరిగితే దుకాణాలు మూసేయూల్సిందేనని మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
     
    నిబంధనలివీ...
     
    జిల్లాలో 458 మద్యం దుకాణాల నిర్వహణకు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వడం, ఇందులో 385 దుకాణాలకు వ్యాపారులు లెసైన్సులు దక్కించుకోవడం జరిగిపోయింది. నూతన పాలసీతో ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.120 కోట్ల వరకు ఆదాయం దక్కింది. అయితే నూతన పాలసీలో ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ఇందులో భాగంగా స్కాన్ అండ్ ట్రేస్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

    ఈ పద్ధతిలో ప్రతి మద్యం సీసాపై హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అడహేషన్ లేబుల్ (హెచ్‌ఈఏఎల్) ఏర్పాటు చేయాలి. అంటే మద్యం స్టాకును దుకాణాలకు తరలించేప్పుడే ప్రతి బాటిల్, బాక్సులకు హెచ్‌ఈఏఎల్ వేస్తారు. వీటిని దుకాణాల్లో విక్రయించేప్పుడు అక్కడ ఓ కంప్యూటర్, ప్రింటర్, స్కానింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి బాటిల్ విక్రయానికి కంప్యూటర్ బిల్లింగ్ ఇచ్చి గరిష్ట చిల్లర ధర మాత్రమే వసూలు చేయాలి.

    ఇప్పటికే 20 శాతం వరకు లెసైన్సు ఫీజులు పెరగడం, ప్రతి మద్యం దుకాణానికి రూ.2 లక్షలు చెల్లించి పర్మిట్ గది తీసుకోవడం, ఏడు సార్లు షాపులు నిర్వహించిన వాటికి లెసైన్సు ఫీజులో ఎనిమిది శాతం ప్రివిలైజేషన్ రుసుము అదనంగా చెల్లించాలనే నిబంధనలకు తలూపిన మద్యం వ్యాపారులు తాజాగా కంప్యూటర్ బిల్లింగ్ ఇవ్వడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. కానీ ఆగస్టు ఒకటి నుంచి డిపోల్లో తీసుకునే మద్యం స్టాకుకు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లు ఉండాలని, లేనిపక్షంలో స్టాకు ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారు.
     
    వ్యాపారుల ఇబ్బందులు...
     
    మద్యం బాటిల్‌పై కంప్యూటర్ స్కానింగ్ పద్ధతి ఉండటంతో ఎవరైనా కేసుల కొద్దీ మద్యం కొనుగోలు చేసి బయట విక్రయిస్తే బెల్టుషాపు నిర్వహస్తున్నారని స్టాకు ఇచ్చిన తమపై కేసు నమోదు చేస్తారని వ్యాపారులు భయపడుతున్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు కొమ్ము కాయడానికే అంద రినీ ఒకే వ్యక్తి నుంచి కంప్యూటర్ పరికరాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి బాటిల్‌ను స్కానింగ్ చేస్తూ, బిల్లులు ఇచ్చుకుంటూ వెళితే రద్దీగా ఉన్నప్పుడు, విద్యుత్ సరఫరా లేనప్పుడు వ్యాపారం జరగదని చెబుతున్నారు.
     
     బిల్లింగ్ ఉండాల్సిందే...
     వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లులు పెట్టాల్సిందే. లేకుంటే మద్యం స్టాకు ఇచ్చే ప్రసక్తేలేదు. గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ అంశాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం. బిల్లింగ్ లేకుండా మద్యం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు.            
     - శేషారావు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్, చిత్తూరు.

>
మరిన్ని వార్తలు