స్పీడ్ పెరగాలి

17 Feb, 2015 01:03 IST|Sakshi
స్పీడ్ పెరగాలి

నగరం నుంచి వేగంగా నడిచే రైళ్లు అవసరం
విశాఖ, హైదరాబాద్, చెన్నై,  తిరుపతిలకు నాన్‌స్టాప్‌లు కావాలి
స్పీడ్ రైళ్లకు ఫుల్ డిమాండ్
డబ్బు కన్నా టైమ్‌కే ప్రాధాన్యత ఇస్తున్న ప్రయాణికులు
విమానాలు, బస్సుల వైపు  మొగ్గు చూపుతున్న జనం
 

విజయవాడ :  రాష్ట్ర విభజన తర్వాత నగరానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి కేంద్రంగా మారింది. ఈ క్రమంలో నగరానికి రాకపోకలు సాగించే ప్రముఖుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరం నుంచి ఢిల్లీకి, ఇతర ముఖ్య పట్టణాలకు వేగవంతమైన రైళ్లు నడపాల్సిన అవసరం ఏర్పడింది. చార్జీలు భారమైనప్పటికీ వేగంగా వెళ్లే రైళ్లకే ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. చార్జీల గురించి పట్టించుకోకుండా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఇప్పటివరకు కొత్త రైళ్లు కోరుకున్న రైల్వే డివిజనల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వేగవంతమైన రైళ్లు సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

దురంతో వంటి రైళ్లు అవసరం
 

ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు దురంతో ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు విశాఖపట్నంలో ప్రారంభమైతే విజయవాడలో ఆగుతుంది. ఇక్కడ సిబ్బంది మాత్రమే మారతారు. ప్రయాణికులు ఎక్కే అవకాశం లేదు. విజయవాడలో బయలుదేరితే హైదరాబాద్‌లోనే ఆగుతుంది. దీంతో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రైలు టికెట్లకు తీవ్ర డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి రైళ్లను విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు  నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం నగరం ఆయా   ప్రాంతాలకు వెళ్లేందుకు ఆరు గంటల సమయం పడుతోంది. నాలుగు గంటల్లో హైదరాబాద్, చెన్నై, తిరుపతిలకు వెళ్లే విధంగా విజయవాడ నుంచి నాన్‌స్టాప్ రైళ్లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైళ్లు గంటకు 50 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో నడుస్తున్నాయని, దీనిని 110 కిలోమీటర్లకు పెంచితే నగరం నుంచి చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలకు ప్రయాణికులను నాలుగు గంటల్లో తీసుకెళ్ల వచ్చని చెబుతున్నారు. ప్రయాణ సమయం తగ్గిన కొద్దీ ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుందని ఓ అధికారి తెలిపారు. గన్నవరం నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కొన్ని బస్సులు కూడా హైదరాబాద్‌కు 4.30 గంటల్లోనే చేరుతున్నాయని, రైళ్లు మాత్రం ఆరు గంటలకు వెళ్తున్నాయని, దీని వల్ల ఎక్కువ మంది బస్సులకే వెళ్తున్నారని పేర్కొన్నారు.

విమానాలకూ పెరిగిన ప్రయాణికులు..
 
ఇటీవల ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగింది. దశాబ్దన్నర క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం నడిపేందుకు ప్రయాణికులు ఉండరని భయపడేవారు. ప్రస్తుతం రోజూ ఢిల్లీకి రెండు, బెంగళూరుకు రెండు, హైదరాబాద్‌కు మూడు సర్వీసులు, విశాఖపట్నం, తిరుపతిలకు ఒక్కో విమాన సర్వీసులను నడుపుతున్నారు. ఢిల్లీకి రెండు గంటలు, బెంగళూరుకు 70 నిమిషాలు, హైదరాబాద్‌కు 55 నిమిషాల్లో ప్రయాణికులు చేరుతున్నారు. దీంతో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సర్వీసులకు 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. రైలు కన్నా చార్జీ ఎక్కువ అయినప్పటికీ సమయం కలిసి వస్తోందని రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా విమానాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో స్పీడ్ రైళ్లు వస్తే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. రానున్న రైల్వే బడ్జెట్‌లో ఎన్ని రైళ్లు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.                

మరిన్ని వార్తలు