హైదరాబాద్‌ నుంచి అమృత్‌సర్‌కు విమాన సేవలు

18 Nov, 2023 04:03 IST|Sakshi

లక్నో,గ్వాలియర్, కొచ్చిన్‌ నగరాలకు కొత్తగా విమానాలు  

లక్నో – హైదరాబాద్‌ మధ్య వారానికి ఆరు సర్విసులు 

హైదరాబాద్‌ –గ్వాలియర్‌ మధ్యవారానికి మూడు సర్వీసులు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్‌ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 10.15కి అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్‌ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (ఐగీ 953) హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్‌కు చేరుకుంటుంది.  

గ్వాలియర్‌కు ఆరు సర్విసులు 
నవంబర్‌ 28 నుంచి హైదరాబాద్‌–గ్వాలియర్‌ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్‌ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్‌ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్‌ ఫణిక్కర్‌ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు