విన్నపాలు వినవలే..

11 Jan, 2014 00:38 IST|Sakshi
గెడెం ఆనందరావు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఏఐసీసీ పరిశీలకుడు గెడెం ఆనందరావు శుక్రవారం జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆనందరావు హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి గీతారెడ్డితో సమావేశమై.. జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు బరిలో ఉంటారు, మన పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తే ఎన్నికల్లో గెలుపొందుతారు అనే వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.

ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, వరంగల్  జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాంభద్రయ్యతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడు జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, షేక్‌సాబేర్ ఏఐసీసీ పరిశీలకునికి స్వాగతం పలికారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఏఐసీసీ పరిశీలకున్ని కలిసి సన్మానం చేశారు.

 ఎంపీ టికెట్ కోసం ముగ్గురు పోటీ
 జహీరాబాద్ ఎంపీ స్థానం కోసం ముగ్గురు నేతలు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట పోటీ పడినట్టు తెలిసింది. సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డిలు తమ మద్దతుదారులతో ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఎంపీ షెట్కార్ పేరును డిప్యూటీ సీఎం దామోదర, మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే కిష్టారెడ్డి బలపర్చినట్లు సమాచారం.

 జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల నేతలతో ఏఐసీసీ పరిశీలకులు గెడెం ఆనందరావు విడివిడిగా సమావేశమయ్యారు. మొదట అందోలునియోజకవర్గం నాయకులతో ఆనందరావు భేటీ అయ్యారు. మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్నపాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, నియోజకవర్గ నేత జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఏఐసీసీ పరిశీలకులు ఆనందరావును కలిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి డిప్యూటీ సీఎం దామోదర పోటీ చేయాలని, ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ఉంటే పార్టీకి బాగుంటుందని వివరించినట్లు సమాచారం.  

 షెట్కార్, కిష్టారెడ్డి పరస్పరం మద్దతు
 జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని మరోమారు ఆశిస్తున్న సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డిలు తమ మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిశారు. సురేష్ షెట్కార్ ఎంపీ టికెట్ కోరగా అందుకు కిష్టారెడ్డి మద్దతు తెలిపినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే టికెట్ కిష్టారెడ్డికి ఇస్తే బాగుటుందని షెట్కార్ ఏఐసీసీ పరిశీలకునికి చెప్పినట్లు తెలుస్తోంది.

 జహీరాబాద్ నుంచి గీతారెడ్డి వద్దు?
 జహీరాబాద్ నియోజకవర్గం నుంచి మూడు గ్రూపులకు చెందిన నాయకులు విడివిడిగా ఏఐసీసీ పరిశీలకుడు ఆనందరావును కలిశారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ వర్గానికి చెందిన నాయకులు శేరి ఆశోక్, విజయ్‌కుమార్ తదితరులు ఎమ్మెల్యే టికెట్ మంత్రి గీతారెడ్డికి కేటాయించవద్దని, ఆమెకు ఇస్తే పార్టీ ఓటమిపాలవుతుందని చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గ నాయకులు హన్మంతరావుపాటిల్, అల్లాడి నర్సింలు,   తదితరులు మాత్రం మంత్రి గీతారెడ్డికి టికెట్ కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మాజీ జడ్పీటీసీ మాణిక్యమ్మ, కాంగ్రెస్ జిల్లా నాయకులు సామ్యుయేల్, ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు నవీన్ తమకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని ఏఐసీసీ పరిశీలకున్ని కోరారు.

 నేడు ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ రాక
 మెదక్‌పార్లమెంట్‌కు సంబంధించిన ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ శనివారం సంగారెడ్డికి రానున్నారు. మెదక్ పార్లమెంట్‌పరిధిలోని  సిద్దిపేట, మెదక్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, బ్లాక్ కాంగ్రెస్, పట్టణకాంగ్రెస్ అధ్యక్షులతో సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశం కానున్నారు. 

మరిన్ని వార్తలు