లెంపకాయలేస్తామంటే.. గంపెడు పూలు పంపిస్తాం

30 Sep, 2013 10:16 IST|Sakshi
లెంపకాయలేస్తామంటే.. గంపెడు పూలు పంపిస్తాం

తాడేపల్లిగూడెం: లెంపకాయలేస్తామంటే.. గంపెడు పూలు పంపిస్తాం. తెలుగుతల్లి మొదలేదో తల్లి వేరునడుగు.. నీ సంస్కృతి వేరంటే బతుకమ్మనే పాడేస్తానంటూ గజల్స్ శ్రీనివాస్ చేసిన గీతాలాపన ఆకట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం స్థానిక జేఏసీ, వైసీపీ రిలే దీక్షా శిబిరాలను ఆయన సందర్శించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు రాష్ట్రం కలిసి ఉండటానికి ఇంతగా ఉద్యమిస్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి రాలేదని, వారు ఇలాగే ఉంటే బ్యాలెట్ బాక్సులలో పొలిటికల్ ఫాక్సులకు (నక్కలకు) బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ప్రపంచ వ్యాప్తంగా గాంధేయ మార్గంలో జరుగుతున్న ఉద్యమంగా సమైక్యాంధ్ర  ఉద్యమం పేరొందిందన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదటానికి ఓయ్.. తెలుగువాడా గీతం జీవం పోయడం పూర్వజన్మసుకృతమన్నారు. వెంకటేశ్వరునిపై పాడిన గీతానికంటే ఓయ్ తెలుగువాడా ప్రాచుర్యం పొందిందన్నారు. ఉద్యమం ఇంకా వేడెక్కాలన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రైళ్లలో పాట యాత్ర ప్రారంభించనున్నట్టు శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ రైలు పాట యాత్ర ఉంటుందన్నారు.

సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. అపార్టుమెంటుల్లోని మహిళలు రిలే దీక్షలలో పాల్గొనడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. 108 గంటల పాటు నిర్విరామంగా సమైక్యాంధ్ర పాటలపోటీ గూడెంలో ఏర్పాటు చేస్తే బాగుంటు ందని, అన్ని విధాలుగా తాను సహకరిస్తానని చెప్పారు. నాన్‌పొలిటికల్ శిబిరంలో కూర్చున్న మహిళలను అభినందించారు. వైసీపీ శిబిరంలో దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. వైసీపీ సమన్వయకర్త తోట గోపి, జేఏసీ చైర్మన్ ఈతకోట తాతాజీ, పైలు శ్రీనివాసు తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు