మెట్ట రైతుకు మంచి రోజులు

22 Nov, 2023 05:53 IST|Sakshi

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ 9 గంటలు నిరంతరాయంగా సరఫరా

ఒకే విడత.. అందులో పగటిపూట కరెంట్‌తో పంటభూములు కళకళ 

సాగు కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.12 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లు 

 రూ.1,700 కోట్లతో వ్యవసాయ ఫీడర్ల ఆధునికీకరణ.. గతంలో 4 సర్వీసులకు ఒకటే ట్రాన్స్‌ఫార్మర్‌.. ఇప్పుడు ప్రతి బోరుకీ ఒకటి

ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైతే తక్షణమే మరమ్మతులు.. లేదంటే కొత్తవి సిద్ధం

నిర్ణీత వ్యవధిలోగా వ్యవసాయ సర్వీసులు మంజూరు.. మెరుగుపడ్డ విద్యుత్‌ సరఫరాతో పెరిగిన ఫలసాయం

అడుగడుగునా అంతరాయాలు.. రాత్రిళ్లు పొలాల్లో జాగారాల దుస్థితి నుంచి ధీమాగా సాగుకు కరెంట్‌ 

కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూడెం గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్‌ : 
‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో ఏమాత్రం లోటు రాకూడదు. రైతన్నలకు ఇచ్చే కరెంట్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగు చేయడం లేదా కొత్తది ఇవ్వడం జరగాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. స­ర్వీసు కూడా అడిగిన వెంటనే మంజూ­రు చేయాలి.

అన్నదాతలకు ఎ­లాంటి ఇబ్బంది కలగకూడదు’ అని అధికారంలోకి రాగానే సీఎం వైఎస్‌ జగన్‌  ఇచ్చిన ఆదేశాలు సత్ఫలితాలిస్తు­న్నా­యి. ప్రత్యేకంగా పూర్తిగా బోరు నీటిపైనే ఆధారపడి సాగు చేసే మెట్ట ప్రాంత రైతుల జీవి­తాల్లో వెలుగులు నింపుతున్నాయి. పశ్చిమ గోదా­వరి జిల్లా కొమ్ముగూడెం, కృష్ణాపురం, బంగారుగూ­డెం గ్రామాల్లో రైతుల వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా 2 విడతల్లో ఇచ్చేవారు. అది కూడా వేళకాని వేళల్లో వచ్చేది. గతంలో కరెంట్‌ కోసం రైతన్నలు రాత్రిపూట పొలాల్లో జా­గారం చేయాల్సిన దుస్థితి. ఫీడర్లు సరిపడా లేకపోవడం వల్ల వ్యవసాయ మోటార్లు తరచూ కాలిపోయేవి.

ఏపీలో ఉన్న 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్ర­మే వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు అందుబాటులో ఉండేవి. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌పై నాలుగైదు సర్విసులు ఉండటం వల్ల ఏ సమస్య వచ్చినా అన్నిటికీ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయేది. మరమ్మతులకు నెలల తరబడి సమయం పట్టడంతో కళ్లెదుటే పంటలు ఎండిపోయేవి. పెట్టుబడులు కూడా వెనక్కి రాక అన్నదాతలు అఘాయిత్యాలకు పాల్పడ్డ దుస్థితి గతంలో నెలకొంది. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.1,700 కోట్లను ఖర్చు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 6,605 ఫీడర్లు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. వి­ద్యుత్‌ ప్రమాదాలు, సరఫరా నష్టాలకు ప్రధానంగా ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్‌ లోడ్‌ కారణం. కొత్త సబ్‌ స్టేషన్ల నిర్మాణంతోపాటు ట్రాన్స్‌ ఫార్మర్ల సామర్థ్యం పెంపు, పవర్‌ కెపాసిటర్ల ఏర్పాటు, పాత లైన్ల మరమ్మతులతో సమస్యలు తొలగిపోయాయి. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి వ్యవసాయ సర్వీసుకీ ట్రా­న్స్‌­ఫార్మర్‌ ఏర్పాటు చేసి కరెంట్‌ అందిస్తున్నారు.  

ప్రభుత్వానిదే భారమంతా.. 
తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిధిలో వ్యవసాయ ఫీడర్లు ఏటా 15,700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. ఇది ఏపీలో ఏటా వినియోగించే 64 నుంచి 66 వేల మిలియన్‌ యూనిట్ల వినియోగంలో నాలుగింట ఒక వంతు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, బ్రేకర్ల జీవిత కాలం 25 ఏళ్లుగా సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్థారించింది. కాల పరిమితి తీరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. లేదంటే యూనిట్‌కు రూ.8 చొప్పున న­ష్టాలు పెరుగుతాయి. ఒక ట్రాన్స్‌ఫా­ర్మర్‌ నుంచి నాలుగైదు సర్విసులకు విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు త్వరగా పాడవుతున్నాయి.

ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి మరమ్మతులకు రూ.102 కోట్లు ఖర్చవుతోంది. దీన్ని అధిగమించేందుకు హై వోల్టేజ్‌ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్‌), రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌) ద్వారా ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ, ఫీడర్లను వేరు చేయడం లాంటి చర్యలు చేపట్టారు. బోరు దగ్గరకు 180 మీటర్ల వరకు ఉచితంగా విద్యుత్‌ లైన్లను సమకూరుస్తున్నారు. సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ ఫార్లర్లు, లైన్ల సామర్థ్యం పెంచుతున్నారు. ఈ ప్రక్రియకు ఒక్కో వ్యవసాయ సర్విసుకు అయ్యే దాదాపు రూ.1.20 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.  

రైతులకు ఏ కష్టం రాకుండా.. 
వ్యవసాయ రంగం అభివృద్ధికి సీఎం జగన్‌ పెద్ద­పీట వేస్తున్నారు. నా­ణ్య­మైన విద్యుత్‌ ఇచ్చేందుకు పంపిణీ వ్యవస్థను పటిష్టం చేశారు. ఏపీలో మొత్తం 2,12,517 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. వేలాది కి.మీ. పొడవున కొత్త లైన్లు నిర్మించాం.  – కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  

తడిచిన పొలమే తడిచి.. 
మా ప్రాంతంలో అంతా కరెంట్‌పై ఆ­ధారపడే వ్యవసాయం జరుగుతుంది. గతంలో హెచ్‌టీ, ఎల్‌టీ లై­న్లు ఒకే స్థంభం మీద ఉండటంతో చిన్న గాలికే కలిసిపోయి ట్రా­న్స్‌­ఫా­ర్మ­ర్, మో­­టార్‌ కాలిపోయేవి. రోజుకి 7 గంటలు అది కూడా 2,3 మూడు సార్లు కరెంట్‌ ఇవ్వడంతో తడిచిన పొలాలే తడిచి అవస్థలు ఎదుర్కొన్నాం. ఈ ప్రభు­త్వం పగటిపూట 9 గంటలు కరెంటిస్తుంది.     – రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం 

మరిన్ని వార్తలు