అంచెలంచెలుగా ఎదిగి..

11 Oct, 2017 11:20 IST|Sakshi
పీడీ కోటేశ్వరరావుతో గాయత్రి, హ్యాండ్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న గాయత్రి

హ్యాండ్‌బాల్‌లో జాతీయ స్థాయికి ఎదిగిన గాయత్రి

ఉత్తరప్రదేశ్‌లో జరిగే పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపిక  

నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన ఆ బాలిక జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఆడే స్థాయికి ఎదిగింది. తొమ్మిదో తరగతి చదువుతుండగానే రెండుసార్లు జాతీయ పోటీలకు అర్హత సాధించింది. మొదటిసారి జాతీయ క్రీడల్లో క్వార్టర్‌ ఫైనల్‌లో ఆడి ప్రతిభను చాటింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురానికి చెందిన మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న దాడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీ బుజ్జా వెంకటరత్నం, సుమతీల కుమార్తె గాయత్రి. ఆమె సైదాపురం ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. దీంతో తల్లిదండ్రులు కూడా చేయూతనందించా రు. సైదాపురం ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న కోటేశ్వరరావు క్రీడల పట్ల గాయత్రికి ఉన్న ఆసక్తిని గుర్తించి హ్యాండ్‌బాల్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు.

పలు పోటీలకు..
పీడీ శిక్షణతో గాయత్రి మండల, జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి తర్వాత రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరుకుంది. 2015లో జరిగిన సెలెక్షన్‌లో జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికై ఢిల్లీలో పోటీల్లో పొల్గొంది. అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి జట్టులో ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈనెల 4వ తేదీన తూర్పుగోదావరిలో జరిగిన 63వ స్కూల్‌ గేమ్స్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనగా రాష్ట్ర జట్టు గెలుపొంది జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. దీంతో గాయత్రికి మరోసారి జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే పోటీల్లో పాల్గొననుంది.

ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుంది. వారిని ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధిస్తారు. గాయత్రి ఎంతో క్రమశిక్షణతో ఆట నేర్చుకుంది. ఆమె జాతీయ జట్టులో చోటు సంపాదించడం చాలా ఆనందంగా ఉంది. – కోటేశ్వరరావు, పీడీ

జిల్లాకు మంచి పేరు తెస్తా
జాతీయ పోటీల్లో బాగా ఆడి మన జిల్లాకు మంచి పేరు తీసుకువస్తా. తల్లిదండ్రులు, పీడీ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే జాతీయస్థాయి పోటీలు ఆడగలుగుతున్నా.  –›గాయత్రి

మరిన్ని వార్తలు