Archery: పౌరాణిక సినిమాలు చూసి ఆకర్షితుడై.. గోల్డ్‌ మెడల్‌! ఒలింపిక్స్‌ లక్ష్యంగా అక్షయ్‌..

5 Sep, 2023 19:05 IST|Sakshi

చాట్ల అక్షయ్‌.. విలువిద్యలో సత్తా చాటుతున్నాడు. గురితప్పని సాధనతో విజయాలను తన విలువిద్యతో సొంతం చేసుకుని శభాష్‌ అనిపించుకుంటున్నాడు. సాధారణంగా పౌరాణిక సినిమాలు చూసే అలవాటున్న అక్షయ్‌ ఆ సినిమాల్లోని బాణాల వైపు ఆకర్షితుడయ్యాడు. అది గమనించిన తండ్రి ఆర్చరీలో శిక్షణను ఇప్పించడంతో అతనిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసింది.

నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన చాట్ల రాజేష్‌, సుమలకు ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరూ విలువిద్యల్లో రాణిస్తున్నారు. పెద్దబ్బాయి చాట్ల అక్షయ్‌ మహదేవ్‌ 2019లో విలువిద్య సాధన ప్రారంభించారు. 3వ తరగతిలో ప్రారంభమైన విలువిద్య 8వ తరగతికి వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయికి చేరింది.

ప్రారంభించిన ఏడాది నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రాణించడం మొదలు పెట్టారు. ఐదేళ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. విలువిద్యలో మూడు సెగ్మెంట్లు ఉంటాయి. ఇండియన్‌ రౌండ్‌ సెగ్మెంట్‌ జాతీయ స్థాయిలో, రికార్వ్‌ సెగ్మెంట్‌ ఒలింపిక్స్‌లో, కాంపౌండ్‌ సెగ్మెంట్‌ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తుంటారు. ఆకాష్‌ మహదేవ్‌ క్లిష్టతరమైన రికార్వ్‌ సెగ్మెంట్‌లో రాణించడం విశేషం.- నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)

కాస్ట్లీ క్రీడ...
అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. నెల్లూరులో ఆర్చరీకి తగిన ఆదరణ లేని సమయంలో అక్షయ్‌ మాధవ్‌ తాత చాట్ల నర్సింహారావు స్కూల్‌ డైరెక్టర్‌గా తన స్కూలు కోసం ఒక ఆర్చరీ అకాడమీని ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక విల్లు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటుంది.

బాణాలు రూ.12 వేలు, రూ.40 వేలు వరకు విలువ చేస్తాయి. ఇక టార్గెట్‌ పేస్‌లు, టార్గెట్‌ బట్టర్స్‌ ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడినవే. ఇప్పటి వరకు విజయవాడ, హైదరాబాదులకు పరిమితమైన ఈ ఆర్చరీ శిక్షణ నెల్లూరులో ప్రారంభం కావడంతో అక్షయ్‌కు కలిసి వచ్చింది.

ఖర్చు అధికమైనప్పటికీ
ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.40 నుంచి 6.30 గంటల వరకు సాధన చేస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతూ పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించేవాడు. ఖర్చు అధికమైనప్పటికీ స్కూల్లో పిల్లలు సైతం విలు విద్యలో రాణిస్తారని, ఏకాగ్రత సాధించగలుగుతారని స్కూల్‌ డైరెక్టర్‌ చాట్ల నర్సింహారావు తెలిపారు.

అక్షయ్‌ మహదేవ్‌లో విలువిద్య క్రీడా ఆసక్తిని గమనించిన తండ్రి రాజేష్‌ శిక్షణ ఇప్పించేందుకు జార్ఖండ్‌ నుంచి దివ్య ప్రకాష్‌ను ఎంపిక చేసుకున్నారు. కోచ్‌ దివ్య ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం సాధనలు చేస్తున్నాడు. జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ కార్యదర్శి పావురాల వేణు, రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్‌ కార్యదర్శి చేకూరి సత్యనారాయణలు మంచి సహాయ సహకారాలను అందచేస్తూ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు బాటలు వేస్తున్నారు.

పతకాలిలా...
2022వ సంవత్సరం నుంచి జరిగిన ప్రతి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అక్షయ్‌ ప్రతిభ కనపరిచారు. 2023 జూలైలో శ్రీలంకలో జరిగిన కొలంబో ఓపెన్‌ ఆర్చరీ ఇంటర్నేషనల్‌ పోటీల్లో అండర్‌–12 రికార్వ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ను, 30 మీటర్ల ఓపెన్‌ రికార్వ్‌ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ను సాధించి అబ్బుర పరిచారు.

గోల్డ్‌ మెడల్‌ లక్ష్యం
ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించి దేశానికి పేరు తెస్తాను. చదువుల్లో రాణించి ఐఏఎస్‌ అధికారి కావాలన్నది కోరిక. ఉదయం సాయంత్రం సాధన చేస్తూ చదువుల్లో కూడా రాణిస్తాను. పోటీల్లో పాల్గొనడం వల్ల వివిధ క్రీడాకారుల ఆట తీరు, పలు ప్రాంతాల పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చు. చదువుకుంటూనే ఇష్టమైన క్రీడల్లో రాణించవచ్చు. తాతయ్య, అమ్మ నాన్నలు, కోచ్‌లు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. – చాట్ల అక్షయ్‌ మహదేవ్‌

చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!

మరిన్ని వార్తలు