గురుకులాల్లో ఇంటర్‌ సీట్లకు డిమాండ్‌

31 May, 2019 11:19 IST|Sakshi
గురుకుల కళాశాల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరైన బాలికలు

కౌన్సెలింగ్‌కు హాజరైన 2,050 మంది బాలికలు

మూడు కళాశాలల్లో ఉన్న 450 సీట్లు భర్తీ

పాడేరు : ఏజెన్సీలోని మూడు బాలికల గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశం కోసం గురువారం స్థానిక అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియం ఆవరణలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గురుకులాల్లో ఇంటర్‌ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 2050 మంది విద్యార్థినులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పాడేరు, అరకు గురుకుల బాలికల జూనియర్‌ కళాశాలల్లో(ఆంగ్ల మాధ్యమం) 9 గ్రూపులకు 330 సీట్లు, జీకే వీధిలోని (తెలుగు మీడియం) మూడు గ్రూపులకు 120 సీట్లు ఉన్నాయి. గ్రూపు కు పరిమితంగా సీట్లు ఉండడంతో చాలా మందికి సీట్లు దక్కలేదు. టెన్త్‌లో 8.0 గ్రేడ్‌పాయింట్లు, పీటీజీ వారికి 7.0 గ్రేడ్‌ పాయింట్లు పైగా సాధించి న వారికి ఇంగ్లిష్‌ మీడియం కళాశాలల్లోను, 9.0 గ్రేడ్‌ పాయింట్లు పైగా వచ్చిన వారికి మాత్రమే తెలుగు మీడియం కళాశాలల్లో సీట్లు లభించాయి. ఈ మూడు కళాశాలల్లో అన్ని గ్రూపుల్లో మొత్తం 450 సీట్లు కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేశారు.

సీట్లు పెంచాలని విద్యార్థినుల వినతి : ఏటా గురుకులాల్లో సీట్లు లభించక విద్యార్థినులు సతమతమవుతున్నారు.
ఏజెన్సీలో గిరిజన బాలికల కోసం గురుకుల జూనియర్‌ కళాశాలలు మాత్రమే ఉండడం, తక్కువ సీట్లు ఉండడంతో అడ్మిషన్లు పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది వందలాది మంది విద్యార్థినులు గురుకులాల్లో సీట్లు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గతేడాది 1500 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది వారి సంఖ్య రెండువేలకు దాటింది. సీట్లు దక్కక పలువురు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గురుకుల కళాశాలల్లో సీట్లు పెంచాలని బాలికలు ఐటీడీఏ వద్దకు చేరి అధికారులను కోరారు.

500 సీట్లు పెంపునకు ప్రతిపాదన : మూడు గురుకుల కళాశాలల్లో 500 సీట్లు పెంపు కోసం ప్రతిపాదనలు చేశామని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జి.విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది టెన్త్‌ పాస్‌ పర్సంటేజి పెరగడంతో పాటు విద్యార్థులు మంచి గ్రేడ్‌ పాయింట్స్‌ సాధించడంతో గురుకులాల్లో ఇంటర్‌ సీట్ల పెంపు అవసరాన్ని ముందే గుర్తించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.కె బాలాజీ గురుకుల కార్యదర్శి భాను ప్రసాద్‌తో మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం మొదటి కౌన్సెలింగ్‌లో 450 సీట్లు భర్తీ చేశామని, సీట్లు పెంపు అనుమతి రాగానే మలివిడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు