నేటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం

15 Nov, 2023 08:38 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 23న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీసీపీ–1 కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి పేటీఎం(ఇన్‌సైడర్‌.ఇన్‌)లో టికెట్లు పొందవచ్చన్నారు.

17, 18 తేదీల్లో పీఎంపాలెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం బీ గ్రౌండ్‌, వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌ గాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయించనున్నట్లు చెప్పారు. ఆఫ్‌లైన్‌లో ఒకరికి రెండు టికెట్లు మాత్రమే విక్రయిస్తారని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో 10,500, ఆఫ్‌లైన్‌లో 11,500 టికెట్లు విక్రయిస్తారని, కాంప్లిమెంటరీ టికెట్లు 5 వేల వరకు ఉంటాయన్నారు.

పోలీసులకు సహకరించాలి : క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చే వారు పోలీసులకు సహకరించాలని డీసీపీ–1 కోరారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందుగానే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని సూచించారు. పోలీసులు సూచించిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురావద్దన్నారు. సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టికెట్లపై ప్రత్యేకంగా మార్కు ఉంటుందన్నారు.

స్కాన్‌లో ఆ మార్కు రాకపోయినా, కలర్‌ జిరాక్స్‌ టికెట్లు తీసుకొచ్చినా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. వేరే వారి దగ్గర కొనుగోలు చేశామని కుంటిసాకులు చెప్పవద్దన్నారు. అలా వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు