గోల్‌మాల్‌

19 Jun, 2018 09:19 IST|Sakshi
వినియోగదారులు లేక మూసి ఉంచిన కర్నూలు ప్రకాష్‌నగర్‌లోని చంద్రన్న విలేజ్‌ మాల్‌ 

చంద్రన్న విలేజ్‌ మాల్స్‌లో నాసిరకం సరుకులు 

ధరలూ ఎక్కువే ఆసక్తి చూపని వినియోగదారులు 

నిర్వహణ భారమంటున్న డీలర్లు 

ఇది చంద్రన్న విలేజ్‌ మాల్స్‌లో లభిస్తున్న బెల్లం. కేవలం 450 గ్రాముల నల్లటి  బెల్లం ఎంఆర్‌పీ ఏకంగా రూ.42 ఉంది. దీన్ని ఆఫర్‌ కింద రూ.37కు అమ్ముతున్నారు. 
అదే బహిరంగ మార్కెట్‌లో మొదటి రకం బెల్లం కిలో రూ.48కే లభిస్తోంది. ఒక్క బెల్లమే కాదు.. చింతపండు, ఇతర నిత్యావసర వస్తువులదీ ఇదే పరిస్థితి. 

కర్నూలు(అగ్రికల్చర్‌) : జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 54 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. డీలర్లు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాల్‌ ఏర్పాటు చేయాలంటే డీలరుకు 200 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన షాపు ఉండాలి. అది కూడా రోడ్డుకు వంద మీటర్లలోపు ఉండాలి. ఇప్పటివరకు అతికష్టం మీద ఆరు మాల్స్‌ ఏర్పాటు చేశారు. వీటిని కర్నూలు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం, కోడుమూరులో ప్రారంభించారు. ఇవి కూడా వినియోగదారులు రాక వెలవెలబోతున్నాయి. ఈ మాల్స్‌కు రిలయన్స్‌ సంస్థ సరుకులు సరఫరా చేస్తోంది. నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులనూ మార్కెట్‌ ధర కంటే తక్కువకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాల్స్‌కు సరఫరా అవుతున్న సరుకుల్లో కొన్ని నాణ్యతగా ఉండడం లేదు. ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మరీముఖ్యంగా బెల్లం, చింతపండు, శనగపప్పు, మినపపప్పు, చక్కెర, పామోలిన్‌ ప్యాకెట్లు తదితర వస్తువుల నాణ్యత, ధరల పట్ల వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. నాణ్యత బాగుంటే ఒకటి, రెండు రూపాయలు ఎక్కువ ఉన్నా తీసుకుంటారు. అయితే.. సరుకులు నాసిరకంగా ఉండడం, ధర కూడా ఎక్కువ కావడంతో వినియోగదారులు మాల్స్‌ వైపు వెళ్లడం లేదు. దీంతో డీలర్లు వాటిని మూసి ఉంచుతున్నారు.  

ఊరించి నష్టాల ఊబిలోకి.. 
చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ను నిర్వహించే డీలర్లకు సరుకుల అమ్మకాలపై ఎనిమిది శాతం కమీషన్‌ ఇస్తామని మొదట్లో ఊరించారు. షాపును మాల్‌గా తీర్చిదిద్దేందుకు అయ్యే ఖర్చును వంద శాతం భరిస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం మూడు శాతం కమీషన్‌తో సరిపుచ్చుతున్నారు. కర్నూలు ప్రకాశ్‌నగర్‌లోని రేషన్‌షాపు నంబరు 50లో చంద్రన్న విలేజ్‌ మాల్‌ను మూడు నెలల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని డిజైన్‌ చేసిన వ్యయంలో 50 శాతం మొత్తాన్ని ఎనిమిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని రిలయన్స్‌ సంస్థ ఒత్తిడి తెస్తోంది. డీలర్‌కు ఎనిమిది శాతం కమీషన్‌ ఇస్తామని మభ్యపెట్టి మూడు శాతంతో సరిపుచ్చుతోంది. పైగా బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధర ఉండి.. డిమాండ్‌ ఉన్న వస్తువులను సరఫరా చేయడం లేదు. నాణ్యత లేని, అధిక ధరలు ఉన్న సరుకులను మాత్రమే సరఫరా చేస్తోందని డీలర్లు వాపోతున్నారు.   


ఇదెలా సాధ్యమో? 
చంద్రన్న విలేజ్‌మాల్‌కు సరఫరా చేసే 25 గ్రాముల సబ్బు ఎంఆర్‌పీ రూ.5గా నిర్ణయించారు. దీన్ని ఆఫర్‌ కింద రూ.4.70కి విక్రయించాల్సి ఉంది. డీలరుకు వేస్తున్న ధర రూ.5.40.  పైగా నెలకు రూ.2 లక్షల విలువైన వస్తువులను సరఫరా చేస్తామని చెప్పిన రిలయన్స్‌ సంస్థ అడ్డగోలుగా ధరలు పెంచి తూతూ మంత్రంగా సరుకులు ఇస్తోంది.  

నిర్వహణ భారంగా మారింది
షాపు డిజైన్‌ చేసిన ఖర్చు మొత్తం భరిస్తామని మొదట్లో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మొత్తం ఖర్చులో 50శాతం  8శాతం వడ్డీతో చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. 8శాతం కమీషన్‌ ఇస్తామని చెప్పి 3శాతం మాత్రమే ఇస్తున్నారు. మార్చిలో రూ.1,193, ఏప్రిల్‌లో రూ.3,002 మాత్రమే కమీషన్‌ వచ్చింది. కరెంటు బిల్లు రూ.800 దాకా వస్తోంది. షాపును శుభ్రం చేయడానికి రూ.1,200 ఇవ్వాల్సి వస్తోంది. కమీషన్‌ ఏ మూలకూ చాలడం లేదు. పైగా డిమాండ్‌ ఉన్న వస్తువులు సరఫరా చేయరు. డిమాండ్‌ లేని సరుకులు మాత్రం అడగకపోయినా ఇస్తున్నారు. ఇలాగైతే ఈ మాల్‌ను నిర్వహించడం కష్టం.     
– కరుణాకర్‌గుప్త, 50వ షాపు డీలర్, కర్నూలు  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా