ఇదేం తీరు చంద్రబాబూ

14 Jun, 2014 01:18 IST|Sakshi
  • అప్పుడే నీ బుద్ధి బయటపడుతోంది
  •  తీపికబురు చెబుతావనుకుంటే తీసేస్తామంటావా?
  •  రాజకీయాలు చేస్తున్నామనడం సాకు కాదా?
  •  ఆగ్రహోదగ్రులవుతున్న ఆదర్శ రైతులు
  •  రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరిక
  • బుచ్చెయ్యపేట : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు తన బుద్ధిని బయటపెట్టుకుంటున్నారని, తొలి మంత్రి వర్గ సమావేశం తర్వాత తీపి కబురు చెబుతారని ఆశిస్తే ఆదర్శ రైతుల్ని తొలగిస్తామని ఆయన ప్రకటించడం ఎంతవరకు సమంజసమని సంఘం జిల్లా అధ్యక్షుడు బి.ఆదినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ఆదర్శ రైతుల వ్యవస్థను తొలగిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బుచ్చెయ్యపేట మండలంలోని వివిధ గ్రామాల ఆదర్శ రైతులతో శుక్రవారం ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న ఆదర్శ రైతులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు.

    ఆదర్శ రైతుల్లో అన్ని పార్టీల వారూ ఉన్నారని గుర్తు చేశారు. రుణాలెవరూ చెల్లించవద్దని, బ్యాంకు వాళ్లు వస్తే తిరగబడాలని, రుణమాఫీపై తొలిసంతకం చేస్తానని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలిచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టాక రుణమాఫీపై కమిటీవేసి కాలయాపన చేయడంతోనే ఆయన నైజం బయటపడిందని విమర్శించారు.
        
    చంద్రబాబు హయాంలో నిరంతర విద్యాకేంద్రాల ప్రేరక్‌లను నియమిస్తే వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక వారిని తొలగించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. పైగా వెయ్యి రూపాయలున్న గౌరవ వేతనాన్ని రూ.3 వేలుకు పెంచి వైఎస్ ఆదుకున్నారని చెప్పారు.

    ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వం 1269వ నంబర్ జీవో ప్రకారం ఆదర్శ రైతుల్ని నియమించిందని, రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల మంది, జిల్లాలో 1600 మంది ఆదర్శ రైతులున్నారని, వారిని రోడ్డున పడేయవద్దని కోరారు.  రైతులకు, సాగుకు అనుసంధాన కర్తలుగా ఉన్న ఆదర్శ రైతులను క్రమబద్ధీకరించి వారి గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుంటే ఆదర్శ రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
     

మరిన్ని వార్తలు