వేతనాలిచ్చేదెన్నడు?

8 Feb, 2014 02:58 IST|Sakshi

నిర్మల్ రూరల్, న్యూస్‌లైన్ :  రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం తమపై వివక్ష చూపుతుండడంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదనకు లోనవుతున్నారు. ఓ వైపు ఉద్యోగ భద్రత కరువు.. మరోవైపు వేతనాలు సరిగా అందక వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.

ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆగస్టు వరకు మాత్రమే వేతనాలు ఇచ్చారని, ఇటీవలే సెప్టెంబర్ వేతనం చెల్లించారని వారు చెబుతున్నారు. ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలలకు సంబంధించిన వేతనం చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నారు. విద్యార్థులకు రెగ్యులర్‌గా క్లాసులు చెబుతున్నా తమ వేతన గోడు వినేవారు కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 మొదటి నుంచీ కష్టాలే..
 జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల జీతం ప్రారంభంలో నెలకు రూ.4500. ఎన్నో ఆందోళనల తర్వాత ఆ మొత్తం రూ.18 వేలకు పెరిగింది. వేతనం పెరిగినా నెలనెలా అందించడంలో జాప్యం జరుగుతుండడంతో కాంట్రాక్టు లెక్చరర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లే ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్న తరుణంలో తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కాంట్రాక్టు లెక్చరర్లు కోరుతున్నారు. ఆయా డిమాండ్లపై గతంలో  వారు ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకపో యింది. ఇకనైనా పెండింగ్ వేతనాలు చెల్లించి, నెలనెలా వేతనం సక్రమంగా చెల్లించేలా చర్య లు తీసుకోవాలని, తమ సర్వీసును రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు