సర్కారు భూములు హాంఫట్!

6 Oct, 2013 03:03 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వివిధ సంస్థలకు బదలాయిస్తున్న ప్రభుత్వ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. నామమాత్రపు ధరకే భూములను కొట్టేయడంలో కనబరుస్తున్న శ్రద్ధ.. సంస్థల స్థాపనలో చూపకపోవడంతో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. నిర్దేశిత వ్యవధిలో కార్యకలాపాలు ప్రారంభించని సంస్థల నుంచి స్థలాలను స్వాధీనం చేసుకోవాల్సి వున్నా.. ఆ దిశగా యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో రూ.కోట్ల విలువైన స్థలాలకు రెక్కలొస్తున్నాయి. జిల్లాలో 35,514 ఎకరాలను ఏపీఐఐసీ, హెచ్‌ఎండీఏ, దిల్, రాజీవ్ స్వగృహ, టూరిజం తదితర సంస్థలకు ప్రభుత్వం బదలాయించింది. ప్రజా, పారిశ్రామిక అవసరాల పేర యూనిట్లు పెట్టేందుకు ఆసక్తి చూపిన సంస్థలకు ఈ భూములను కట్టబెట్టారు.
 
 కారుచౌకగా అప్పగించిన ఈ స్థలాల్లో చాలామంది పరిశ్రమలు, ఇత ర యూనిట్లను ఔత్సాహికులు నెలకొల్పినప్పటికీ, అత్యధికులు మాత్రం స్థలాలను కాజేసి మిన్నకుండి పోయా రు. రాయితీలు దక్కించుకోవడం మినహా.. పారిశ్రామిక విస్తరణ దిశగా ఆలోచనలు చేయడంలేదు. ఈ క్రమంలోనే జిల్లాలో కేవలం 27,346 ఎకరాలు మాత్రమే ఇప్పటివరకు వినియోగంలోకి వచ్చాయంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. నిర్దేశిత అవసరాలకు వాడగా 7,370 ఎకరాల మిగులు భూములను ఆ కంపెనీలు అట్టిపెట్టుకున్నాయి. ఇటీవల రెవెన్యూ యంత్రాం గం జిల్లావ్యాప్తంగా వివిధ సంస్థలకు జరిపిన భూ కేటాయింపులు. వాటి వినియోగంపై క్షేత్రస్థాయిలో సర్వే జరిపింది. ఈ పరిశీలనలో వేలాది ఎకరాలు ఇప్పటికీ వినియోగంలోకి రాకపోగా.. సుమారు 794 ఎకరాలు కబ్జాదారుల పాలైనట్లు తేలింది.
 
 స్థలాలను కైవసం చేసుకున్న సంస్థల పర్యవేక్షణ లేకపోవడం, నిర్దేశించిన కాలపరిమితిలో యూనిట్లను స్థాపించకపోవడంతో అక్రమార్కులు వీటిపై కన్నేసినట్లు స్పష్టమైంది. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ.1000 కోట్లపైనే పలుకుతుందని అంచనా. పారిశ్రామిక, గృహావసరాలను సాకుగా చూపి అడ్డగోలుగా భూసేకరణ జరిపి బడా సంస్థలు కట్టబెడితే.. ఈ భూములు పరాధీనం కావడం అధికారులను నివ్వెరపరిచింది. ముఖ్యంగా ఏపీఐఐసీ ఎడాపెడా భూసేకరణ చేపట్టింది. పారిశ్రామికవాడల పేర యథేచ్ఛగా భూసేకరణ పర్వాన్ని కొనసాగించింది. పేద రైతాంగానికి ముఖ్యం గా అసైన్డ్‌భూములతో జీవనోపాధి పొందుతున్న అట్టడుగువర్గాల భూములను సేకరించింది. అక్కడక్కడా పారిశ్రామిక వాడలు ఏర్పాటుచేసినప్పటికీ, వ్యాపారవేత్తలు ముందుకు రాకపోవడంతో అవి ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల పారిశ్రామికవాడలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. లేఅవుట్లు చేయకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో యూనిట్లు పెట్టేందుకు సంస్థలు ఆసక్తి చూపడంలేదు.
 
 ఈ తంతు ఓవైపు ఇలాసాగుతుండగానే మరోవైపు ఆయా సంస్థలకు బదలాయించిన భూములు అక్రమార్కుల చెరలోకి వెళ్లిపోతుండడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 769.02 ఎకరాలు, మల్కాజ్‌గిరి డివిజన్‌లో 1.06, రాజేంద్రనగర్ డివిజన్‌లో 20.28, చేవెళ్ల డివిజన్‌లో 3.08 ఎకరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో బయటపడింది. అంతేకాకుండా ఈ స్థలాల్లో తిష్టవేసిన కబ్జాదారులు యాజమాన్య హక్కుల కోసం పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 53కేసులు వివిధ కోర్టుల్లో నడుస్తున్నాయి. వీటిలో చాలావరకు హైకోర్టు పరిధిలోనే కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. విలువైన భూములపై కన్నేసిన ఆక్రమణదారులు కొంతమంది రెవెన్యూ అధికారులతో మిలాఖత్ అయి ఈ తతంగం నెరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివిధ అవసరాల నిమిత్తం భూములు తీసుకున్న సంస్థల నిర్లక్ష్యంతోనే రూ.కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు