మర్రిగూడ తహసీల్దార్‌ ఇంట్లో రూ.2 కోట్ల నగదు

1 Oct, 2023 02:19 IST|Sakshi

కిలో బంగారు నగలు, విలువైన డాక్యుమెంట్లు కూడా...

నాలుగున్నర కోట్లకుపైగా ఆస్తులు స్వాదీనం చేసుకున్న ఏసీబీ 

కార్యాలయంలోనూ భూముల రిజిస్ట్రేషన్ల రికార్డుల తనిఖీ 

హస్తినాపురం/మర్రిగూడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని అందిన సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్‌ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. హస్తినాపురం షిరిడీ సాయినగర్‌ కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఏసీబీ డీఎస్పీ మజీద్‌ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మహేందర్‌రెడ్డి ఇంటితోపాటు బంధువుల ఇళ్లు, మర్రిగూడ మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా సోదాలు చేశారు.

కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తహసీల్దార్‌ ఇంట్లోని ఒక ఇనుప పెట్టెలో రెండు కోట్ల ఏడు లక్షల నగదు, కిలో బంగారు నగలు, విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. మొత్తం వీటి విలువ రూ.నాలుగున్నర కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప్నం మండలం వెలిమినేడుకు చెందిన మంచిరెడ్డి అంజిరెడ్డి కుమారుడు.

అంజిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కారుణ్య నియామకం కింద మహేందర్‌రెడ్డి మహేశ్వరం మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. అనంతరం కందుకూరు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో డీటీవోగా పనిచేశాడు. తర్వాత ప్రమోషన్‌పై మహేశ్వరం తహసీల్దారుగా బదిలీపై వెళ్లారు. కందుకూరు తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మహేందర్‌రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివాదాల్లో అక్రమంగా డబ్బులు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. 45 రోజుల క్రితం మర్రిగూడ తహశీల్దారుగా బదిలీపై వెళ్లారు.


చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు 

మరిన్ని వార్తలు