ఫేస్‌బుక్‌లో రూ.8.52 లక్షలకు టోకరా

13 Sep, 2017 09:13 IST|Sakshi
ఫేస్‌బుక్‌లో రూ.8.52 లక్షలకు టోకరా

సాక్షి, పెనమలూరు: ఫేస్‌బుక్‌లో పరిచయమై రూ.8.52 లక్షలకు తనను మోసం చేశారంటూ ఓ ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు  కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెనమలూరు మండలం కామయ్యతోపు (కానూరు)కి చెందిన కడియం శివ కామేశ్వరి నూజివీడులోని సీతారామపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో అశ్విధామ్సన్‌ అనే వ్యక్తితో శివ కామేశ్వరికి పరిచయం ఏర్పడింది.

పదిహేను రోజుల క్రితం రూ .41 లక్షలు విలువైన ఆభరణాలు, సామాగ్రి బహుమతి వచ్చిందని శివకామేశ్వరికి ధామ్సన్‌ తెలిపాడు. స్థానిక చార్జీలు భరించాలన్నాడు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఎలైడ్‌ కొరియర్‌ సర్వీస్‌ నుంచి శివ కామేశ్వరికి ఫోన్‌ వచ్చింది. స్థానిక చార్జీలు కింద రూ 8.52 లక్షలు చెల్లించాలని కొరియర్‌ సర్వీస్‌ ప్రతినిధులు చెప్పారు. ఎస్‌బీఐ రెండు ఖాతాలు, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలకు శివకామేశ్వరి రూ 8.52 లక్షలు జమ చేసింది.

డబ్బు చెల్లించినా కొరియర్‌ రాకపోవటంతో ఫేస్‌బుక్‌లో థామ్సన్‌తో సంభాషణ జరిపేందుకు ప్రయత్నం చేశారు. అయితే థామ్సన్‌ ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన కామేశ్వరి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దామోదర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు