వేరుశనగ రైతుల అగచాట్లు

13 Sep, 2013 02:34 IST|Sakshi


 మహబూబాబాద్, న్యూస్‌లైన్ :
 దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. సబ్సిడీ విత్తనాల పంపిణీలో లింక్‌లతో కొర్రీలు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన విధానం జిల్లాలోని వేరుశనగ రైతులకు శాపంగా మారింది. సర్కారు నిర్ణయంతో చేసేదేమీ లేక సంబంధిత అధికారులు సైతం చేతులెత్తేస్తుండడంతో కర్షకులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇందుకు మానుకోట మండలంలోని వేరుశనగ రైతుల దీనావస్థే నిదర్శనంగా నిలుస్తోంది. మండల పరిధిలో సుమారు 12 వేల మంది రైతులు మూడు వేల హెక్టార్లలో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ మేరకు గత ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకున్న అధికారులు మూడు వేల క్వింటాళ్ల పత్తివిత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. నేటి వరకూ విత్తనాలు రాకపోగా... అందుకు సంబంధించిన ధరను సైతం ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇప్పటికే ఆలస్యమవుతున్న క్రమంలో ప్రభుత్వం హడావుడిగా వేరుశనగ విత్తనాల పంపిణీలో నూతన విధానానికి  శ్రీకారం చుట్టింది.
 
  సబ్సిడీ విత్తనాల పంపిణీని మీ సేవ కేంద్రాలకు లింక్ చేయడంతోపాటు రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలనే నిబంధనలు విధించింది. రాష్ట్రంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వరంగల్ జిల్లా కూడా ఉండడంతో ఇక్కడి రైతులు అగచాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.  రైతులకు మీ సేవ కేంద్రాలపై అవగాహన లేకపోవడం... కొంతమంది రైతులకు పహాణీలు మాత్రమే ఉండడంతో సబ్సిడీ విత్తనాలకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డారుు.
 
 గతంలో ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సీడి విత్తనాలను అధికారులే పంపిణీ చేసేవారు. సంబంధిత రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు గానీ.. పహాణాలు గానీ పరిశీలించిన తర్వాత అధికారులే నేరుగా పర్మిట్లు జారీ చేసేవారు. వాటితో సంబంధిత షాపుల్లో కర్షకులు సులువుగా విత్తనాలను కొనుగోలు చేసేవారు. కానీ... తాజాగా ప్రభుత్వ అమలు చేసిన విధానం రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. సబ్సిడీని ఎత్తివేయాలనే కుట్రతో ఈ విధానాన్ని అమలు చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 పనిచేయని వెబ్‌సైట్లు.. విద్యుత్ కోతలు
 సబ్సిడీ విత్తనాల కోసం రైతులు మీ సేవ కేంద్రానికి వెళ్లి పట్టాదారు పాసు పుస్తకం, దరఖాస్తు ఫారం, బ్యాంక్ అకౌంట్‌ను సమర్పించాలి. ఆ తర్వాత మీ సేవ సిబ్బంది వాటిని స్కాన్ చేసి సంబంధిత వ్యవసాయ అధికారుల వె బ్‌సైట్‌కు పంపిస్తారు.  
 
 వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ సమాచారాన్ని తిరిగి మీ సేవకు పంపిస్తారు. తదుపరి రైతుల దరఖాస్తులను మీ సేవ కేంద్రాల సిబ్బంది స్వీకరిస్తారు. అధికారులు తిరస్కరించినా... సంబంధిత పత్రాలు లేకపోయినా... ఆ రైతుకు విత్తనాలు ఇవ్వరు. వెరిఫికేషన్ అనంతరమే రైతులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పటివరకు విత్తన సంచుల ధరలను ప్రభుత్వం నిర్ణరుుంచలేదు. వెబ్‌సైట్లు సరిగ్గా పనిచేయకపోవడం..  విద్యుత్ కోతల వంటి సమస్యలతో సబ్సిడీ విత్తనాల విధానం ప్రహసనంగా మారింది. ఫలితంగా విత్తనాల కోసం వేరుశనగ రైతులు మీ సేవ కేంద్రాల చుట్టు ప్రదక్షణ లు చేస్తున్నారు. సహనం కోల్పొయిన రైతులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి వాగ్వాదానికి దిగుతుండడంతో స్థానిక అధికారులకు  తలనొప్పిగా మారింది.

మరిన్ని వార్తలు