సవ్యంగా సాగేనా?

26 Jun, 2014 02:41 IST|Sakshi
సవ్యంగా సాగేనా?

అనంతపురం అగ్రికల్చర్ : రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ నేటి (గురువారం) నుంచి మొదలు కానుంది. ఉదయం ఏడు గంటలకు పంపిణీ ప్రారంభించాల్సి ఉండగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతుండటంతో తొలిరోజు కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ కౌంటర్లను ఉదయం తొమ్మిది గంటలకు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. తక్కిన రోజుల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు వరకు పర్మిట్ కౌంటర్లు, సాయంత్రం ఆరు గంటల వరకు డెలివరీ కౌంటర్లు పని చేయనున్నాయి. జిల్లాలోని 63 మండల కేంద్రాల్లోనూ విత్తన పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. విత్తన వేరుశనగతో పాటు విత్తన కందులు, విత్తనశుద్ధి మందుగా ట్రైకోడెర్మావిరిడీ అందుబాటులో ఉంచారు.
 ప్రతి మండలంలోని గ్రామాలను మూడు క్లస్టర్లుగా విభజించి గురువారంతో పాటు ఈ నెల 28, 30 తేదీల్లో తొలివిడత పంపిణీ చేపట్టనున్నారు. ప్రకటించిన గ్రామాలకు చెందిన రైతులు మాత్రమే కేంద్రాలకు రావాలని అధికారులు సూచించారు. పట్టాదారు పాసు పుస్తకంలోని భూ విస్తీర్ణాన్ని బట్టి 30 కిలోల చొప్పున కలిగిన మూడు బస్తాల విత్తనకాయలు అందజేస్తారు. 30 కిలోల బస్తా విలువ రూ.1,020 కాగా.. మూడు బస్తాలకైతే రైతు తన వాటాగా రూ.3,060 చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌జీ-41 రకం కందులు సబ్సిడీ పోనూ కిలో రూ.39.50 ప్రకారం ఒక్కో రైతుకు నాలుగు కిలోల ప్యాకెట్ ఇవ్వనున్నారు. విత్తనశుద్ధి మందు ట్రైకోడెర్మావిరిడీ అర కిలో రూ.12.50 ప్రకారం పంపిణీ చేయనున్నారు.
 
 ఈ ఏడాది జిల్లాకు 3.50 లక్షల క్వింటాళ్ల కే-6 రకం విత్తన వేరుశనగ కేటాయించారు. ప్రస్తుతానికి ఆయిల్‌ఫెడ్, హాకా, మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్ ఏజెన్సీలు 70 వేల క్వింటాళ్లు జిల్లాకు చేర్చాయి. ఇంకా నాలుగైదు మండల కేంద్రాలకు విత్తనకాయలు చేరకపోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. అయితే.. గురువారం తెల్లవారే సరికి అన్ని మండల కేంద్రాల్లోనూ విత్తనకాయలు తగినంత నిల్వ చేస్తామని వారు చెబుతున్నారు. పంపిణీ సవ్యంగా జరగడానికి వీలుగా ఆర్డీఓలు, వ్యవసాయశాఖ డీడీ, ఏడీఏలతో సీడ్ మానిటరింగ్ సెల్, విత్తన నాణ్యత పరిశీలనకుశాస్త్రవేత్తల బృందాలతో క్వాలిటీ సెల్ ఏర్పాటు చేశారు.
 
 సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, వాణిజ్య పన్నుల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో నిఘా ఉంచుతున్నారు. అన్ని కేంద్రాల్లోనూ ఆరు కౌంటర్లు పురుషులకు, మహిళలు, వికలాంగులకు విడిగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటర్ల దగ్గర గ్రామాలను తెలిపే సూచన బోర్డులు ఉంటాయి. నీటి సదుపాయం, ప్రథమ చికిత్స, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జేడీఏ వెల్లడించారు. ఇదిలావుండగా.. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో విత్తన ప్రారంభోత్సవ ఏర్పాట్లు బుధవారం రాత్రి పూర్తయ్యాయి.
 
 ఏడీఏ మద్దిలేటి, మండల వ్యవసాయాధికారి అల్తాఫ్ అలీఖాన్ దగ్గరుండి ఏర్పాట్లు చేయించారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, ఏడీఏ (పీపీ) రంగస్వామి, ఆయిల్‌ఫెడ్ డీఎం ఏకాంబరబాబు, మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, యార్డు కార్యదర్శి వై.రామ్మోహన్‌రెడ్డి, తహశీల్దార్ లక్ష్మినారాయణ, త్రీటౌన్ సీఐ దేవానంద్, ఎస్‌ఐ తమీమ్‌అహ్మద్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.  
 
 విత్తన పంపిణీ
 పకడ్బందీగా చేపట్టండి : కలెక్టర్
 కనగానపల్లి :  రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా విత్తన వేరుశనగ పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కనగానపల్లిలో ఏడీఏ రవిశంకర్, తహశీల్దార్ వసంతలతతో కలసి విత్తన పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు.
 
 పంపిణీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వస్తుండటంతో అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని చెప్పారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అవసరమైన మేర కౌంటర్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు, నీడ ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో పది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, తొలిరోజు మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలోని రైతులకు విత్తన పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏడీఏ వివరించారు. మొదటి విడతకు అవసరమైన విత్తనకాయలు కూడా గోదాములకు చేర్చామన్నారు.
 

మరిన్ని వార్తలు