పంట చేనే ఏటీఎం! రైతులకు నిరంతరం ఆదాయం ఇచ్చేలా..!

14 Nov, 2023 09:46 IST|Sakshi
ఏటీఎం చేలో పృథ్వీరాజ్‌

20 సెంట్లలో 20 రకాల పంటల ప్రకృతి సేద్యం

నిరంతర ఆదాయం.. 2 నెలల్లోనే రూ. పది వేల ఆదాయం 

ప్రకృతి వ్యవసాయంలో సరికొత్త అధ్యాయం ఎనీ టైమ్‌ మనీ (ఏటీఎం) నమూనా. కొద్ది సెంట్ల భూమిలోనే ఏడాది పొడవునా రకరకాల కూరగాయ పంటల సాగు ద్వారా రైతుకు నిరంతర ఆదాయం ఇస్తున్న పంటల నమూనా ఇది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ద్వారా క్షేత్రస్థాయిలో రైతులతో ఏటీఎం సాగును చేపట్టి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. కౌలు రైతు దూసరి పృథ్వీరాజ్‌ ఇందుకో నిదర్శనం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని తూములూరు శివారు క్రిస్టియన్‌పాలెం పృథ్వీరాజ్‌ నివాసం.

కౌలుకు తీసుకున్న ఎకరం 20 సెంట్ల రేగడి భూమిలో ఏటీఎం మోడల్‌ను గత రెండు నెలలుగా సాగు చేస్తున్నారు. నాలుగు అడుగుల వెడల్పుతో ఎత్తుమడులను ఏర్పాటు చేసుకొని పైన డిజైన్‌లో చూపిన విధంగా 20 కూరగాయ పంటలు వేశారు. ఘనజీవామృతం, జీవామృతం 15 రోజులకోసారి ఇస్తున్నారు. జిల్లాలో 40 మంది రైతులతో ఏటీఎం మోడల్‌ను ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నామని డీపిఎం రాజకుమారి తెలిపారు. 
– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి

రెండు నెలల్లో రూ. పది వేల ఆదాయం!
2 నెలల క్రితం 20 సెంట్లలో ప్రకృతి వ్యవసాయం ఏటీఎం మోడల్‌లో పంటలు సాగు చేస్తున్నాను. 4 అడుగుల వెడల్పుండే 8 బెడ్స్‌లో 20 రకాల పంటలు వేశాం. గోంగూర, రెడ్‌ తోటకూర, పాలకూర, చుక్కకూర 20 రోజులకోసారి కోతకు వస్తున్నాయి. మరో ఐదారు బెడ్లలో ఆకుకూరలు కోయాల్సి ఉంది. బెండ, వంగ, బీర, గోరుచిక్కుడు, అనుములు, చెట్టుచిక్కుడు కోతకు వచ్చాయి. అన్నీ కలిపి ఇప్పటికి రూ. 10 వేల ఆదాయం వచ్చింది.

చేలో ఒకే ఒక పంట వేసి చేతికొచ్చేవరకు ఆగకుండా రకరకాల పంటలను సాగు చేయటం ద్వారా ఎప్పటి కప్పుడు అధికాదాయం పొందుతున్నాం. ఏడాదికి 20 సెంట్లలో రూ. లక్షన్నర వరకు ఆదాయం వస్తుందనుకుంటున్నాం. భార్యాభర్తలు ఇద్దరం పంటలను కనిపెట్టుకుంటూ పనులను మేమే చేసుకుంటున్నాం. రసాయనాల్లేని ఆహారం తీసుకుంటూ తగిన ఆదాయం పొందుతున్నాం. 
– డి. పృథ్వీరాజ్‌ (63058 37151),  క్రిస్టియన్‌పాలెం, గుంటూరు జిల్లా 

(చదవండి: ఇంటి పంటగా కుంకుమ పువ్వు!)
 

మరిన్ని వార్తలు