నిషేధం ఉన్నా లెక్క లేదు

3 Feb, 2018 10:49 IST|Sakshi

గుంటూరు:  పోలీసులు కళ్లుగప్పి జిల్లా నుంచి గుట్కాల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గుంటూరు నుంచి మినీ లారీ అడుగు భాగాన బస్తాల్ని అమర్చి విశాఖపట్నం తరలిస్తుండగా గత ఏడాది నవంబరు 5న ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వాహనంలో రూ. కోటి విలువ చేస్తే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.

మళ్లీ మూమూలే..
గుంటూరు రూరల్‌ జిల్లా పరిధిలో గత ఏడాది ఆగస్టులో ఎస్పీ సీహెచ్‌ వెంకటప్పలనాయుడు ఆదేశాల మేరకు ఏకకాలంలో పోలీసులు దాడులు చేసి 1275 గుట్కా బస్తాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవేమీ లెక్క చేయని వ్యాపారులు అధికార పార్టీ నేతల అండదండలతో రాజధాని ప్రాంతంలో యథేచ్ఛగా చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం అక్రమ రవాణా జరుగుతుందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నీరుగారిన నిషేధం
గుట్కా ప్రాణాంతకమన్న ఉద్దేశంతో 2013లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా ఎక్కడా అమలు కావడం లేదు. గుంటూరు నగర శివారుల్లో ముఖ్యంగా వట్టిచెరుకూరు, వింజనంపాడు, ఏటుకూరు రోడ్లలో అక్రమార్కులు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి పాన్‌మసాలా తయారీ పేరుతో లైసెన్స్‌లు పొందుతున్నారు. వీటి లోపల మాత్రం పొగాకుతో నిషేధిత ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు సమాచారం.  చిన్నచిన్న బడ్డీల్లో సైతం అమ్మకాలు జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ దాడులకు యత్నిస్తే అధికార పార్టీ నాయకులతో ఒత్తిళ్లు చేయించి వారి వైపు తిరిగి చూడకుండా చేసి రాత్రి వేళల్లో వాహనాల ద్వారా గుట్కా బస్తాల్ని తరలిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు.  

రెట్టింపు ధరలకు విక్రయాలు
నిషేధం లేని సమయంలో ఎమ్మార్పీకే విక్రయించేవారు. నేడు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్‌పై ఎమ్మార్పీ రూ.2 ఉంటే రూ. 6కు అమ్ముతున్నారు. గతంలో ఖైనీ ప్యాకెట్‌ రూ. 5 ఉంటే ప్రస్తుతం రూ 15 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో విషయానికి వస్తే చెప్పాల్సిన పనిలేదు. ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ అక్రమ రవాణాదారులు కోట్లు గడిస్తున్నారు.

మామూళ్ల వసూలు అవాస్తవం
జిల్లాలో అనేకసార్లు దాడులు నిర్వహించి ఇప్పటి వరకు దాదాపుగా రూ.6 కోట్ల విలువ చేసే గుట్కాల్ని సీజ్‌ చేశాం. సమాచారం ఉంటే 9440379755 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. వివరాలను గోప్యంగా వుంచుతాం. నెలవారీ మామూళ్ల మాట అవాస్తవం.
– గౌస్‌ మొహిద్దీన్,
అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌

మరిన్ని వార్తలు