వెన్నుపోటుపై వెరవక..

29 Aug, 2018 12:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నందమూరి హరికృష్ణ.. ఇటు సినిమా రంగంలో అటు రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. అందులో ఎన్టీఆర్ రాష్ట్రాన్ని చుట్టుముట్టిన చైతన్య రథానికి హరికృష్ణ రథసారధి. అలాంటి హరికృష్ణకు సొంత తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అవమానాలు తప్పలేదు. సొంత బావ చంద్రబాబు నాయుడు కారణంగా ఆయన పార్టీలో అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది.  చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో హరికృష్ణను వాడుకుని వదిలేశారన్న విమర్శ ఉంది. మామకు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో హరికృష్ణ ఆరోజుల్లో చంద్రబాబునాయుడు పక్షాన నిలిచారు. హరికృష్ణతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో సహా మెజారిటీ కుటుంబ సభ్యులు చంద్రబాబు పక్షాన నిలిచారు. అనాడు అధికారం కోసం హరికృష్ణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు వ్యవహరించారు. అయితే చంద్రబాబు మాత్రం హరికృష్ణను తన అవసరాలకు పావుగా వాడుకున్నారన్న విషయం ఆ తర్వాత పరిణామాలు స్పష్టం చేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరినీ దూరం పెడుతూ వచ్చారు. చంద్రబాబు ఎత్తుగడలో ప్రధానంగా బలైంది నందమూరి హరికృష్ణ.    

ఎన్టీఆర్ ను గద్దెదింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు ఆ తర్వాత కాలంలో హరికృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుని రవాణా శాఖ అప్పగించారు. హరికృష్ణ ఎమ్మెల్యే కాకుండానే మంత్రిపదవిని చేపట్టారు. ఆరు మాసాల్లో శాసనసభకు ఎన్నిక కాని కారణంగా ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఆ తర్వాత 1996లో ఆయన హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ చంద్రబాబు ఆయనను కేబినేట్ లో చేర్చుకోలేదు. ఎన్టీఆర్ మరణంతో ఖాళీ అయిన హిందూపూర్ శాసనసభ స్థానానికి ఉపఎన్నికను జాప్యం చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోజుల్లో వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే కాకుండా హరికృష్ణ మంత్రిపదవి చేపట్టి ఆరు నెలలు పూర్తయిన కారణంగా ఆయన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. పార్టీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా కూడా హరికృష్ణకు అవమానాలు తప్పలేదు. ఆ తర్వాత రెండోసారి రాజ్యసభ టికెట్టు నిరాకరించడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గించడం, ఎన్నికల సమయాల్లో దగ్గరకు చేర్చుకోవడం, పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం వంటివి చేస్తూ అవసరం తీరగానే ఆయనను పక్కన పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మహానాడుకు ఆహ్వానించకపోవడం, పొలిట్ బ్యూరో సమావేశాల గురించి సమాచారం ఇవ్వకపోవడం వంటివి అనేక చేదు అనుభవాలు హరికృష్ణకు ఎదురయ్యాయి.

ఇలాంటి అనేక అనుమానాలు, ఆటుపోట్ల మధ్య ఆయన చంద్రాబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి 1999 జనవరి 26 న "అన్నా తెలుగుదేశం పార్టీ'' స్థాపించారు.  అబిడ్స్‌లోని తన సొంత హోటల్ ఆహ్వానం కేంద్రంగా ఆయన పార్టీని స్థాపించారు. అన్నా టీడీపీ తరపున ఆయన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికల బరిలో ఆపార్టీ ప్రభావం చూపలేకపోయింది. 1999 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత క్రమంలో ఆ తర్వాత కాలంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన తిరిగి టీడీపీలో చేరారు. 2008లో ఎట్టకేలకు రాజ్యసభకు పంపినా రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్‌ 4న హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు