అవార్డులు ఆయన సొంతం

15 Aug, 2014 02:30 IST|Sakshi

మహానంది: విధి నిర్వహణ ఆయన ప్రాణం. పేదలకు న్యాయం చేయాలి...వారికి అండగా నిలవాలన్న తపనే ఆయనకు గుర్తింపు తెచ్చింది. కష్టపడితే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. పోలీస్ కావాలనే లక్ష్యంతో శ్రమించి అనుకున్నది సాధించాడు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయని నమ్మిన వ్యక్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు. ఎక్కడ పనిచేసిన అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పటి వరకు ఆయన 366 రివార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు.

అంతేకాకుండా భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపికైనట్లు 2013 గణతంత్ర వేడుకల్లో ఆయన పేరు ప్రకటించారు. ఈ అవార్డును శుక్రవారం కర్నూలులో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీఐ అందుకోనున్నారు.

 శ్రీనివాసులు విజయ గాధపై సాక్షి కథనం...
    మహానంది మండలం ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన బి.వెంకటసుబ్బయ్య అలియాస్ మోజెస్, మద్దమ్మ దంపతుల కుమారుడు బుక్కా శ్రీనివాసులు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేవాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాలన్న సంకల్పంతో శ్రమించాడు. గ్రామంలోని జెడ్పీ స్కూల్‌లో 10 వరకు చదివాడు. కర్నూలులోని కోల్స్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్, సిల్వర్‌జూబ్లీలో డిగ్రీ, ఎస్‌కే యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. జులై 15, 1991లో పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు.

 ఎస్‌ఐగా అనంతపురం జిల్లా పెనుగొండ, ఎల్‌కే పల్లి, రామగిరి, కూడేరు, తాడిపత్రి, ధర్మవరం, తదితర ప్రాంతాల్లో పనిచేసి అన్ని వర్గాల ప్రజలు, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. తిరుమల ట్రాఫిక్, నక్సల్స్ ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. అనంతరం 2005 ఫిబ్రవరిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన శ్రీనివాసులు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఇన్‌స్పెక్టర్‌గా, 2005 నుంచి 2008 వరకు కల్యాణదుర్గం సర్కిల్‌లో, 2009-10లో చిత్తూరు డీటీసీ, ఆ తర్వాత ధర్మవరం, హిందూపురం, ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు పనిచేశారు. 2014 జనవరిలో హిందూపురం టౌన్ నుంచి కడప అర్బన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సీఎం చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోనుండటంతో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు,  మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు