కుండపోత వర్షానికి వణికిన బెజవాడ

4 Sep, 2019 11:30 IST|Sakshi
విజయవాడ జమ్మి చెట్టు సెంటర్‌లో రోడ్డుపై  నిలిచిన వర్షం నీరు

ఉదయం నుంచే దట్టంగా అలముకున్న మబ్బులు.. అడపాదడపా చిరు జల్లులు.. కొన్ని చోట్ల భారీ వర్షం.. మరి కొన్నిచోట్ల మోస్తరు వర్షం.. చల్ల చల్లగా మారిపోయిన వాతావరణం.. ఇదీ విజయవాడ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంగళవారం వాతావరణం. ముఖ్యంగా బెజవాడలో వర్షం ముంచెత్తింది. ప్రధాన రహదారులైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్, ఆటోనగర్, కాళేశ్వరరావు మార్కెట్‌రోడ్డు, గణపతిరావు రోడ్లలో వరద నీరు మురుగుతో కలిసి ఉధృతంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

సాక్షి, అమరావతి : వాయువ్య బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు.. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్‌ జ్వరాలు ప్రబలే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఈ కాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని.. కాచి వడబోసిన నీటిని తాగడంతోపాటు, వేడివేడి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా వర్షాలు
జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు సగటు వర్షపాతం 30.03 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవగా.. ఒక్క విజయవాడ నగరంలోనే 44.56 మి.మీ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెనమలూరు మండలం గంగూరులో 32.75 మి.మీ, ఉయ్యూరులో 31 మి.మీ, పెనమలూరులో 28.25 మి.మీ కంకిపాడు మండలం మద్దూరు 23.50 మి.మీ, కంచికచర్ల మండలం మొగులూరు 23.00 మి.మీ, ఇబ్రహీంపట్నంలో 18.50 మి.మీ, కౌతవరం 18.50 మి.మీ, చాట్రాయి మండలం కోతపాడులో 16.25, విస్సన్నపేట మండలం కోర్లమండలో 13.50 మి.మీ వర్షపాతం నమోదైంది.

నగరాన్ని ముంచెత్తిన వాన!
మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో బెజవాడ మంగళవారం వణికిపోయింది. ఉదయం నుంచే ముసురేసినట్లు నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. 10 గంటల నుంచే మోస్తరుగా ఆయా ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుండపోతగా పడిన వర్షానికి రోడ్లపై నీరు వరదలా ప్రవహించింది. మోకాలు లోతున వరద నిలిచింది. ప్రధాన రహదారులపై వాహనాలు అరగంటకు కిలోమీటరు చొప్పున కదిలాయి. కిక్కిరిసిన రోడ్లతో పాదచారులు, బస్‌స్టాపుల్లో ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వినాయకచవితి నేపథ్యంలో విగ్రహాలు చూడ్డానికి వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. వన్‌టౌన్, కృష్ణలంక, బందరురోడ్డు, ఆటోనగర్, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన వీఎంసీ, అత్యవసర బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. బందరు రోడ్డు ముందు మోకాళ్ల లోతులో నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతంలో అత్యధికంగా 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా అత్యల్పంగా ఎంకే బేగ్‌ స్కూల్‌ ప్రాంతంలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా