ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు

17 May, 2019 15:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈదురు గాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు తెగిపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లోని కొత్తపల్లి పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు మండలాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అక్కడక్కడ చెట్లు నేలకొరగటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నంద్యాలలో గాలి, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ధాటికి చెట్టు విరిగిపడి రైల్వే విద్యుత్ తీగ మీద పడింది.

దీంతో విద్యుత్ లైన్ తెగిపడి, రైల్వే ట్రాక్‌పై పడటంతో స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. విద్యుత్ లైన్ ప్రమాదకరంగా మారటంతో రైల్వే అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలు వాతావరణం చల్లబడడంతో సేదతీరుతున్నప్పటికీ.. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ఎక్కడ విరిగి మీద పడతాయోనని భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు

 

మరిన్ని వార్తలు