కనికరం రాదాయె!

30 Mar, 2016 02:29 IST|Sakshi

మారేడుమిల్లి : ఈ ముసిముసి నవ్వుల వెనుక విషాదమెంతో దాగి ఉంది. అందరి పిల్లల్లా తనకూ ఆడుకోవాలని ఉంటుంది. కానీ కాలు కదపలేదు. ఒకరు ఎత్తుకుని వెళితే కానీ.. మరోచోటికి వెళ్లలేదు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో బతుకీడుస్తున్న ఆ బాలికపై అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కనికరం చూపడం లేదు.
 
 వివరాల్లోకి వెళితే.. స్థానిక సంత మార్కెట్‌కు చెందిన ఉడుగుల నాగరాజు, తంబయమ్మ కూలీ పనులు చేస్తుంటారు. కూలీ పనులకు వెళితే కానీ ఇల్లు గడవని పరిస్థితి వారిది. వారి కుమార్తె భవానికి పుట్టుకతోనే కాళ్లు చచ్చుపడిపోయాయి. వికలాంగురాలిగా మార డంతో కనీసం నిలబడలేని దుస్థితి ఆమెది. రెండేళ్ల వయసులో ఆ పాపను వైద్యులకు చూపించగా, ఆమెకు శస్త్రచికిత్స చేయాలని, రూ.పది లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
 
 అంత ఆర్థికస్తోమత లేకపోవడంతో బాలికకు శస్త్రచికిత్స చేయించేందుకు ఆమె తల్లిదండ్రులు సాహసించ లేకపోయారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, తాతయ్య ఆ బాలిక ఆలానాపాలనా చూస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిదేళ్ల భవాని.. మారేడుమిల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  ఐదో తరగతి చదువుతోంది. నిత్యం ఆమెను ఎవరో ఒకరు స్కూల్‌కు ఎత్తుకుని తీసుకువెళ్లి, తీసుకు వస్తుంటారు.
 
  నేలపై ఎక్కడ కూర్చోపెడితే అక్కడే ఉంటుంది. అటూఇటూ కదల్లేని పరిస్థితి. ఆమెకు పింఛను మంజూరు చేయాలని తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం అధికారులకు దరఖాస్తు చేశారు. సదరం సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అన్నీ ఉన్నా ఆమెకు ఇప్పటివరకు అధికారులు పింఛను మంజూరు చేయలేదు. ఆమెను వెంటబెట్టుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. బాలికకు పింఛను మంజూరు చేయాలని ఆమె తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు