బైరెడ్డికి మళ్లీ చుక్కెదురే!

22 Apr, 2014 06:00 IST|Sakshi
బైరెడ్డికి మళ్లీ చుక్కెదురే!

సాక్షి, హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనపై పోలీసులు నమోదు చేసిన హత్య కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో ఆ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న ప్రధాన అభ్యర్థనతో బెరైడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రతివాదులైన పోలీసులకు నోటీసు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులోని మచ్చుమర్రి గ్రామానికి చెందిన తెలుగు సాయిఈశ్వరుడు గత నెల 15న హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక బెరైడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొందరు ఉన్నారంటూ మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు 3వ టౌన్ పోలీసులు బెరైడ్డి సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బెరైడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను 15న హైకోర్టు కొట్టివేసింది. ఈసారి ఏకంగా ఆ కేసులో ఎఫ్‌ఐఆర్‌నే సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రామ్మోహనరావు సోమవారం విచారణ జరిపారు. బెరైడ్డి తరఫున న్యాయవాది ఎం.వి.రాజారాం వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ రాజకీయ కుట్రలో భాగంగానే బెరైడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. అందువల్ల పిటిషనర్ అరెస్ట్ సహా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేలా పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ  చేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... స్టే ఇవ్వడానికి నిరాకరించారు. అయితే పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ విచారణను వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు