ఇదేమైనా ఎమర్జెన్సీనా?

9 Dec, 2014 01:04 IST|Sakshi

విజయవాడ పోలీసులపై హైకోర్టు మండిపాటు
 సాక్షి, హైదరాబాద్: గుర్తింపు కార్డుల పేరుతో విజయవాడలో పౌరులను పోలీసులు వేధిస్తుం డటంపై హైకోర్టు మండిపడింది. రాత్రి పూట తిరిగే సమయంలో గుర్తింపు కార్డు లేకుంటే నిర్బంధించడాన్ని తప్పుపట్టింది. ఇది ప్రజల హక్కులను హరించడమేనని స్పష్టం చేసింది. మనమేమన్నా ఎమర్జెన్సీలో ఉన్నామా అని ప్రశ్నించింది. విజయవాడ పరిసరాల్లో రాత్రి పూట సంచరించే వారి వద్ద గుర్తింపుకార్డు లేకుంటే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామంటూ విజ యవాడ పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేసింది.
 
 చట్టంలోని లేని నిబంధనలను తెర పైకి తెచ్చి పౌరుల హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. దీనిపైవిజయవాడకు చెందిన న్యాయవాది తానికొండ చిరంజీవి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించిం ది. విజయవాడలో ‘నైట్ సేఫ్ సిటీ’ కార్యక్రమంలో భాగంగా పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ కార్యక్రమానికి నవంబర్ 16వ తేదీన శ్రీకారం చుట్టడం తెలిసిందే. పోలీసుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యకం చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలుకు ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు