పక్కాగా...అందరికీ ఇళ్లు!

1 Sep, 2019 09:58 IST|Sakshi

ఉగాది నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు

వెల్లువలా వస్తున్న దరఖాస్తులు

ఇప్పటికే 44 వేల మంది అర్హుల గుర్తింపు

లక్ష మందికి చేరనున్న లబ్ధిదారుల సంఖ్య

అందుబాటులో 653.45 ఎకరాల భూమి

ఇంకా అవసరమైన భూముల గుర్తింపు

కూడు... గూడు... గుడ్డ... ఇవీ మానవుని కనీస అవసరాలు. ఇప్పటికీ సొంత గూడులేని కుటుంబాలెన్నో ఉన్నాయి. ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా అలాంటివారిని స్వయంగా చూసిన ప్రజానేత జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో వాటి పరిష్కారానికే తొలిప్రాధాన్యమిచ్చారు. అన్ని రంగాలవారినీ ఆదుకునేందుకు నవరత్నాలను తెచ్చారు. రాబోయే ఐదేళ్లలో సొంత స్థలం... ఇల్లు లేని పేదవారుండకూడదన్న సత్సంకల్పంతో ఈ ఉగాదినుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం అవసరమైన స్థలాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 44వేల మంది అర్హులను గుర్తించిన అధికారులు... 653 ఎకరాల భూమినీ గుర్తించారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇల్లులేని ప్రతి పేదవాడికీ ఉగాది నాటికి గృహయోగం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జిల్లా అధికారులు అనువైన స్థలాలను అన్వేషిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరుకు అందిన 2 లక్షల 60 వేల దరఖాస్తుల్లో 44 వేల మందిని అర్హులుగా గుర్తించారు. జిల్లాలో ప్రస్తుతం 653.45 ఎకరాల భూమి పంపిణీకి అందుబాటులో ఉంది. ఒక్కో లబ్ధిదారునికి గ్రామాల్లో 72 గజాలు, పట్టణాల్లో 60 గజాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉన్న, ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకోవడం ద్వారా భూ పంపిణీకి అవసరమైన భూముని సేకరించే పనిలో పడ్డారు.


43వేల మందికి భూమి సిద్ధం..
జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి 646.98 ఎకరాలు ఉంది. చిన్న చిన్న తగాదాలతో మరో 6.47 ఎకరాలు ఉంది. దీనిలో పట్టణ ప్రాంతంలో ఉన్న భూమి 48.54 ఎకరాలు కాగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నది 604.86 ఎకరాలు. 40,602 మందికి గ్రామీణ ప్రాంతంలోనూ, 3262 మందికి పట్టణ ప్రాంతంలోనూ కలిపి దాదాపు 43వేల మందికి పంపిణీ చేయడానికి ఈ భూమి సరిపోతుంది. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులకు ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని పంచిపెట్టవచ్చు. అయితే జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కనీసం లక్ష మంది లబ్ధిదారులు ఉగాది నాటికి తేలవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయోనని క్షేత్రస్థాయిలో వెదుకుతున్నారు.

స్థలాల కోసం వెదుకులాట.. 
జిల్లాలో 34 మండలాలు, 1543 రెవిన్యూ గ్రామాలుండగా 620 గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 923 గ్రామాల్లో భూములు గుర్తిస్తున్నారు. ఐదు పురపాలక సంఘాల్లో రెండింటిలోనే ప్రభుత్వ భూమి దొరుకుతోంది. మిగిలిన వాటిలో వెదుకుతున్నారు. ఈ పనిని జిల్లా వ్యాప్తంగా గ్రామ వలంటీర్ల సహాయంతో అధికారులు చేస్తున్నారు. జిల్లాలో విధుల్లో చేరిన 11,985 మందిలో 11,176 మందికి భూముల గుర్తింపు సర్వేపై శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో ప్రజాసాధికార సర్వే, ఇంటింటి సర్వేలు నిర్వహించి నియోజకవర్గాల వారీగా ఎన్ని ఇళ్లు అవసరమవుతాయనే లెక్కలు అధికారుల వద్ద ఉన్నాయి. వీటి ప్రకారం... చీపురుపల్లిలో 18,390, గజపతినగరంలో 18,607, నెల్లిమర్లలో 26,337, శృంగవరపుకోటలో 21,564, విజయనగరంలో 33,590, బొబ్బిలిలో 25,140, పార్వతీపురం 15,290, సాలూరులో 23,153, కురుపాంలో 19,975 చొప్పున మొత్తం 2,02,046 ఇళ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ ఇళ్ల నిర్మాణ ప్రగతి..
2016–17 నుంచి 2019–20 సంవత్సరాల మధ్య జిల్లాలో గృహనిర్మాణాల ప్రగతిని ఒకసారి పరిశీలిస్తే... గ్రామీణ గృహనిర్మాణ పథకం ద్వారా జిల్లాకు 58788 కేటాయించారు. వీటిలో 31,988 రద్దు చేయడానికి ప్రతిపాదించారు. 26,800 గృహాలు చేపట్టి, 22,451 గృహాలు పూర్తి చేశారు. ఇంకా 4349 గృహాలు పూర్తికాలేదు. వీటిలో 3297 గృహాలు పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. పీఎంఎవై–గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా 6935 గృహాలు మంజూరైతే 3,747 పూర్తిచేశారు. 3188 మిగిలాయి. వీటిలో 1926 ఇళ్లు నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. పీఎంఎవై–ఆర్బన్‌ గృహనిర్మాణ పథకం ద్వారా 39,866 ఇళ్లు మంజూరుకాగా 3,985 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

మిగిలిన 35,881లో ప్రారంభానికి నోచుకోనివి 14,961 ఉన్నాయి. ఇక ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం(పట్టణ) ద్వారా ఫేజ్‌–1, ఫేజ్‌–2లో విజయనగరం, నెల్లిమర్ల, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో 11,837 ఇళ్లు మంజూరైతే 9,744 ఇళ్లు నిర్మాణం చేపట్టి 4624 ఇళ్లు పూర్తి చేశారు. ఈ లెక్కలను బట్టి గత ప్రభుత్వ హయాంలో పేదలెవరికీ కనీసం గూడు కూడా దొరకలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి తమ ప్రభుత్వ హయాంలో తలెత్తకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామవలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థలను పటిష్టంగా తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పడ్డ మంత్రుల కమిటీతో ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా అధికారులు భూములను గుర్తించే పని చేపడుతున్నారు.  

మరిన్ని వార్తలు