క్రేజీ ఫుడ్డు.. బందరు లడ్డు

27 Dec, 2019 19:51 IST|Sakshi
బందరు లడ్డూలు

సాక్షి, మచిలీపట్నం: బెల్లం తునక.. బంగారు పుడక (శనగ పిండితో చేసే సన్నపూస) కలిస్తే బందరు లడ్డూ రెడీ అవుతుంది. సై అనడమే ఆలస్యం. సరసకు చేరిపోతుంది. నోట్లో వేయగానే నేతిని ఊరిస్తూ తీయగా గొంతులోకి జారిపోతుంది. తోక గోధుమ పాలు, బెల్లం పాకం కలగలిస్తే నల్ల హల్వా ప్రత్యక్షమవుతుంది. తియ్యటి రుచుల్ని భలే పంచుతుంది. నిన్నమొన్నటి వరకు తెలుగు ప్రాంతాలకే పరిమితమైన ఈ క్రేజీ వంటకాలు ఇప్పుడు భౌగోళిక గుర్తింపును సొంతం చేసుకుని ప్రపంచ దేశాల్ని చుట్టేస్తున్నాయి. బందరు ఖ్యాతిని దశ దిశలా చాటుతున్నాయి.  

ఇలా మొదలైంది
క్రీస్తు శకం 17వ శతాబ్దం చివరిలో బుందేల్‌ఖండ్‌ ప్రాంతం నుంచి బందరుకు వలస వచ్చిన మిఠాయి వ్యాపారి బొందలి రామ్‌సింగ్‌ సోదరులు బెల్లపు తొక్కుడు లడ్డూ, నల్ల హల్వాను ఈ ప్రాంత వాసులకు పరిచయం చేశారు. వారి నుంచి మిఠాయి తయారీ విధానాన్ని అందిపుచ్చుకున్న బందరు వాసులు కశిం సుబ్బారావు, విడియాల శరభయ్య, శిర్వశెట్టి రామకృష్ణారావు (రాము), శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), గౌరా మల్లయ్య తదితరులు లడ్డూ, హల్వా ప్రాశస్త్యాన్ని కాపాడుకుంటూ విశ్వవ్యాప్తం చేశారు.

తయారీయే ప్రత్యేకం
లడ్డూ తయారీకి కనీసం 12 గంటల సమయం పడుతుంది. ఇందులో శనగపిండి, బెల్లం, నెయ్యి, పటిక బెల్లం, యాలకుల పొడి, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, బాదం పప్పు వినియోగిస్తారు. తొలుత శనగ పిండిని నీట్లో కలిపి నేతి బాండీలో కారప్పూస మాదిరిగా పోస్తారు. అలా వచ్చిన పూసను ఒకపూట ఆరబెట్టి రోకలితో దంచి పొడి చేస్తారు. ఆ పొడిని శుద్ధమైన బెల్లం పాకంలో వేసి లడ్డూ తయారీకి అనువుగా మారేంత వరకు కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొంతసేపు ఆరబెట్టి మళ్లీ రోకళ్లతో దంచుతూ మధ్య మధ్యలో నెయ్యి దట్టిస్తారు. ఒకరు పిండిని తిప్పుతుండగా మరొకరు రోకలితో మిశ్రమాన్ని దంచి జీడిపప్పు, యాలకుల పొడి, పటిక బెల్లం ముక్కలు కలుపుతారు. ఈ మిశ్రమం లడ్డూ తయారీకి అనువుగా మారిన తర్వాత రెండుగంటలు ఆరబెట్టి చెక్క బల్లపై ఒత్తుతూ తగినంత సైజులో లడ్డూలు చుడతారు. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. నేతి హల్వా తయారీలో తోక గోధుమలను వినియోగిస్తారు. వాటిని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు పిండిగా రుబ్బి.. దాని నుంచి పాలు తీస్తారు. దశల వారీగా బెల్లం పాకంలో పోస్తూ కలియ తిప్పతారు. దానిని పొయ్యి నుంచి దించే అరగంట ముందు తగినంత నెయ్యి పోస్తారు. ఆ తర్వాత సరిపడా జీడిపప్పును దట్టించి ప్రత్యేక ట్రేలలో పోసి 24 గంటల పాటు ఆరబెడతారు. ఈ హల్వా రెండు నెలలు నిల్వ ఉంటుంది.

 
దేశ విదేశాలకు ఎగుమతులు
బృందావన మిఠాయి వర్తక సంఘం పరిధిలో 50 మందికి పైగా వ్యాపారులు బందరు లడ్డూ, హల్వా విక్రయిస్తున్నారు. వీరి వద్ద వెయ్యి మందికి పైగా పని చేస్తుండగా, వారిలో 200 మందికి పైగా మహిళలు. బందరు బెల్లపు తొక్కుడు లడ్డూ పరిశ్రమకు 2017లో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రీ విభాగం భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌) ఇచ్చింది. సంఘం తరఫున మల్లయ్య స్వీట్స్‌కు పేటెంట్‌ హక్కు (పార్ట్‌–బి) లభించింది. దీంతో ప్రపంచ దేశాలకు బందరు లడ్డూ, హల్వా ఎగుమతులు భారీగా పెరిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, లండన్, దుబాయ్, కువైట్, బాగ్దాద్‌ వంటి దేశాలకు నిత్యం ఎగుమతి అవుతున్నాయి.


జీఐ గుర్తింపు రావడం గర్వకారణం
మా నాన్న మల్లయ్య తోపుడు బండిపై తిరుగుతూ లడ్డూ అమ్మేవారు. ఆయన వారసులుగా 1993లో మేం ఈ రంగంలోకి అడుగు పెట్టాం. బందరు లడ్డూకు భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించాలన్న పట్టుదలతో సంఘం తరఫున కృషి చేశాం. బందరు వాసి, మాజీ ఐఏఎస్‌ అధికారి ఆర్‌ఎం గోనెల అవిశ్రాంత కృషి ఫలితంగానే బందరు లడ్డూకు జీఐ సర్టిఫికెట్‌ లభించింది.  
– గౌరా వెంకటేశ్వరరావు, బందరు లడ్డూల తయారీదారు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు