భౌబోయ్..ఎంత ఘోరం..

19 Sep, 2015 00:33 IST|Sakshi
భౌబోయ్..ఎంత ఘోరం..

ఇంట్లో ఉన్న బాలుడిపై దాడి
పీక్కుతిన్న శునకాలు
విశాఖలో దారుణం

 
 సాక్షి, విశాఖపట్నం : అప్పటిదాకా అమ్మ ఒడిలో ఆటలాడుకున్నాడు. కాసేపు అమ్మతోనే గడిపాడు. అమ్మ బట్టలుతుకుతుంటే బుల్లిచేతులతో సాయమూ చేశాడు. కన్నపేగు చేయూతను చూసి ఆ తల్లి మురిసిపోయింది. బిడ్డపై కోటి ఆశలతో ఆనంద డోలికల్లో మునిగిపోతూ శ్రమను మరిచిపోయింది. నాన్నా! ఇక్కడొద్దు.. ఇంట్లోకెళ్లిపోరా! అంటూ సున్నితంగా ఇంటికి పంపేసింది. అంతే.. కాసేపటికే కీడు శంకించింది. కుక్కల హడావుడి వినిపించింది. చిన్నారి ఏమయ్యాడోనని పరుగు తీసింది.

ఇల్లంతా వెతికింది. చివరకు పేగులు బయటకొచ్చిన ముద్దుల బిడ్డను శునకాలు పీక్కుతింటున్న ఘోరాన్ని కళ్లారా చూసి హతాశురాలైంది. ఆమె అరుపులు, కేకలు విని ఇరుగుపొరుగు వారు పరుగు పరుగున వచ్చి చిన్నారి శివకేశవ్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. ప్చ్! అప్పటికే ఘోరం జరిగిపోయింది. అయినా ఆఖరి ఆశతో కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు అశువులు బాశాడని బరువెక్కిన గుండెలతో వైద్యులు చెప్పారు..!

 బతుకు దెరువు కోసం పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరేళ్ల క్రితం వచ్చి తమ బతుకేదో తాము బతుకుతున్నారు.. పోతయ్య, రమణమ్మ దంపతులు. వీరి ఇద్దరి సంతానంలో కుక్కలు పొట్టనబెట్టుకున్న ఏడాదిన్నర శివకేశవ్ ఆఖరి వాడు. రోజూ ఆ ప్రాంతంలో వచ్చీరాని నడకతో, అర్థం కాని ముద్దుముద్దు మాటలతో అక్కడి వారిని అలరించేవాడు. తన చిలిపి చేష్టలతో అమ్మానాన్నల కష్టాన్ని మరిపించేవాడు. అలాంటి అల్లరి పిడుగుని చూసి విధికి కన్నుకుట్టినట్టుంది.

శున కాల రూపంలో పంపి పొట్టనబెట్టుకుంది. ‘కుక్కల దాడిలో గాయపడ్డ వారినీ చూశాం.. కానీ ఇంతలా దారుణానికి ఒడిగట్టడాన్ని ఎప్పుడూ చూడలేదు.. పగవాళ్లకు కూడా ఇలాంటి శోకం పెట్టకు దేవుడా!’ అంటూ కేజీహెచ్ క్యాజువాల్టీలో పేగులూడి బయటపడ్డ ఆ బాలుడిని చూసిన ప్రతిఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. బంధాలకతీతంగా కన్నీరొలికారు. బరువెక్కిన గుండెలతో అక్కడ నుంచి నిష్ర్కమించారు. మార్చురీలో శాశ్వత నిద్రకుపక్రమించిన చిన్నారి, బయట అమ్మానాన్నలు, అయిన వారూ తిరిగి రాని  శివకేశవ్ కోసం ఎదురుచూస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు.

మరిన్ని వార్తలు