Why Do Dogs Bite: ఆ కుక్కలు కరిస్తే చాలా ప్రమాదం..కుక్కల దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి?

22 Sep, 2023 13:06 IST|Sakshi

జిల్లాలో రోజురోజుకూ కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ నే ఉన్నాయి. వీధులు, రోడ్లపై గుంపులు గుంపులు గా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి.

అంతేకాకుండా ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నాయి. శునకాల దాడిలో చిన్నారులు ప్రాణాలు వదిలిన సందర్భా లు అనేకం. కుక్క కాటుకు గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.


రోజు రోజుకు కుక్కల బాధితులు పెరిగిపోతున్నారు. కుక్కలు కరవడం వల్ల రేబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రేబిస్ వల్ల ఏటా 55 వేల మందికి పైగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మన దేశంలో కుక్క కాటుకు ఏటా 15 వేలకు పైగా మంది చనిపోతున్నారు.

ఆకలితో దాడి చేస్తున్నాయా..?

ఇంతకీ కుక్కలు మనుషులపై ఎందుకు తెగబడుతున్నాయి. ఆకలితోనా లేక దూపతోనా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసేవి కావు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, వాటికి హాని చేసే జంతువులు, ఇతర ప్రాణులు ఏవైనా కనిపిస్తే దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేయడం ఎక్కువైంది.

ఏ కుక్క మంచిదో ఏది పిచ్చిదో తెలియని పరిస్థితి నెలకొంది. శునకాల దాడికి ప్రధాన కారణం ఆకలి అని పలువురు అంటున్నారు. గ్రామాల్లో, మున్సిపలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది. దీంతో వాటికి ఆహారం దొరకడం లేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రారంభమయ్యాక రోడ్డు పక్క అన్నం, ఇతర ఆహార పదార్థాలు పడేయడం తగ్గింది. దీంతో వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది.

పైగా కుక్కలు తరుచూ దాడి చేస్తుండడంతో వాటిని ఎవరూ చేరదీసి ఆహారం పెట్టడం లేదు. దీంతో అవి ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం దాహం తీర్చుకునేందుకు వీధి నల్లాల వద్ద నీరు కూడా దొరడం లేదు. కుక్కలు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది.

కొన్ని సార్లు ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. అవి అలా అరుస్తూ వెంటపడినప్పుడు ప్రజలు పరుగెడతారు. దీంతో తమకు భయపడి మనుషులు పరుగెడుతున్నారని కుక్కలు భావిస్తాయి. ఈ క్రమంలోనే వాళ్లను వెండిస్తూ కరచే దాకా వదలవు.

ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. 

కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు.  కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు.  
నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. 
►  కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి.  ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్‌ఫెక్షన్‌ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. 
కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. 

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఏబీసీలో 1,429 శునకాలకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ల అనంతరం కొన్నాళ్ల పాటు సెంటర్‌లోనే ఉన్న కుక్కలు బయటి వచ్చాక వరుసపెట్టి జనాలపై దాడికి తెగబడుతున్నాయి. వీధి కుక్కలను ఒకేచోట పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు బంధించి ఉంచడంతో అవి ఒత్తిడికి లోనై మనుషులపై దాడి చేస్తున్నట్లు తెలిసింది. తాండూరులోని ఏబీసీ సెంటర్‌లో కూడా సుమారు 1,247 కుక్కలకు ఆపరేషన్లు చేశారు.

కుక్క కరిస్తే ఏం చేయాలి?

కుక్క కాటుకు గురైన వ్యక్తి ఐదు సార్లు రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటు వల్ల బాగా గాయం అయ్యి రక్తస్రావం అయితే వ్యాక్సిన్ తో పాటు కరిచిన చోట ఇమ్యునొగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే..గతంలో కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒకప్పుడు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేసేవారు. దీంతో ఆ వ్యక్తి ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి మారింది.

వ్యాక్సినేషన్‌

ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల కుక్కలకు రేబీస్‌ వ్యాధి సోకకుండా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ వేశారు. అయినా ఎక్కడో ఒక చోట రేబీస్‌ వ్యాధితో కుక్కలు జనాలపై దాడి చేస్తున్నాయి.

రేబిస్‌తో చాలా ప్రమాదం

రేబీస్‌ వ్యాధికి గురైన పశువులను కుక్కలు కరిసినా, రేబీస్‌ వ్యాధి ఉన్న కుక్కను మరో కుక్క కరిచినా వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి సోకుతుంది. ఆ కుక్కలు మనుషులను కరిస్తే ప్రమాదం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే రేబీస్‌ వ్యాధి సోకుండా ప్రతి ఏటా జూన్‌ మొదటి వారంలోనే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నాం.

పెంపుడు కుక్కలకు కూడా వాటి యజమానులు తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించాలి. కుక్కలను భయపెట్టడం, నేరుగా వాటివైపు చూడడం, వాటి దగ్గరగా పెద్ద చప్పుడు చేయడం వంటివి చేయరాదు. అలా చేస్తే అవి దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
– అనిల్‌కుమార్‌, జిల్లా పశు వైద్యాధికారి

మరిన్ని వార్తలు