ఖజానా ఖాళీ

8 Nov, 2014 00:59 IST|Sakshi
ఖజానా ఖాళీ

జీవీఎంసీకి  హుద్‌హుద్ దెబ్బ    
వెంటాడుతున్న కాసుల కష్టాలు
వేతనాలు ఇవ్వలేని పరిస్థితి
తుపానుకు వెచ్చించిన నిధులొస్తే తప్ప తీరని వెతలు

 
విశాఖపట్నం సిటీ: హుద్‌హుద్ తుపాను మహా నగర పాలక సంస్థ ఖజానాను ఖాళీ చేయించింది. దీంతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి మొ త్తాన్ని తుపానుకు ఖర్చు చేసింది. ఇప్పుడా నిధులు సర్కారు నుంచి వెనక్కు వచ్చినా కొంత తేరుకుంటామని సంస్థ భావిస్తోంది. తుపాను సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు, కొందరు ఐఏఎస్ అధికారులు వచ్చారు. వారి బస, రవాణా, ఆహార పానీయాల కోసం జీవీఎంసీ రూ. 7.5 కోట్లు ఖర్చు చేసింది. ఈ బిల్లుల మొత్తం రాబట్టేందుకు సర్కారు ఈ బిల్లులను పంపింది. అయితే ఇందులో రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. తాజాగా ఆ ఫైల్‌ను ఆర్ధిక శాఖకు పంపింది. నెలనెలా డే అండ్ నైట్ శానిటేషన్ సిబ్బందికి రూ.4.5 కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి వుంది. ఈ నెల
 జీతాలు చెల్లించాలంటే జీవీఎంసీకి చెమటలు పడుతున్నాయి. జీవీఎంసీ అకౌంట్‌లో కొద్దిపాటి మొత్తమే ఉన్నట్లు భోగట్టా. బుల్డోజర్లు, క్రేన్లు, ప్రొక్లైనర్లు, ట్రాన్స్‌పోర్ట్ చేసే లారీలకు డీజిల్, పెట్రోల్ అవసరాలకే ఈ మొత్తం సరిపోతుంది. వీటికి చెల్లిస్తే అత్యవసర పరిస్థితి వస్తే నిధులెక్కడ నుంచి తేవాలో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికీ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు.  జోన్ 1, 2, 4, 5 కార్యాలయాల్లో పని చేసే కొందరు రెగ్యులర్  సిబ్బందికి మాత్రం శుక్రవారం అందజేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, శానిటేషన్, ప్రజా ఆరోగ్య సిబ్బందికి చెల్లించాల్సి వుంది. ఈ నెల 20వ తేదీ వరకూ మిగిలిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొందరు అధికారుల కార్లు, ప్రభుత్వం ఇచ్చిన వాహనాలకు సైతం డీజిల్ లేక కదలడం లేదు.  నీటి సరఫరా విభాగంలోని ఉద్యోగులకు దాదాపు రూ. 80 లక్షలు జీతాలు చెల్లించాల్సి వుంది. మలేరియా సిబ్బందికి కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తుఫాన్ సాయం కింద ప్రభుత్వం నుంచి బకాయిలొస్తే తప్ప వీరి వేతనాలకు మోక్షం కలగదు.
 
 

మరిన్ని వార్తలు