పెథాయ్‌ ఎఫెక్ట్‌: వేలాది ఎకరాల్లో పంట నష్టం

18 Dec, 2018 12:22 IST|Sakshi

సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడ్డ పెథాయ్‌ తుపాన్‌ రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతిసింది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డ తుపాన్‌ భారీ నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు అంచనా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 3,488 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 182 హెక్టార్లలో కూరగాయలు, 630 హెక్టార్లలో అరటి పంట, 21 హెక్టార్లలో మిరప, 4 హెక్టార్లలో ఉల్లి పంటకు నష్టం వాటిల్లింది. తెలిపారు. విద్యుత్‌ సరాఫరాకు పలు చోట్ల తీవ్ర అంతరాయం కలిగింది. ఉప్పాడ బీచ్‌ రోడ్‌ 6 కి​.మీ మేర రోడ్డు పాడవ్వటంతో కోటి రూపాయల మేర నష్టం ఏర్పడింది. కాట్రేనికోనలో 250 విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి.

కృష్ణా జిల్లాలో పదివేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు అనేక వాణిజ్య పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో నీటిలోనే చిక్కుకుని ఉండటంతో ప్రభుత్వం మంగళవారం కూడా పాఠశాలలకు, అంగన్‌ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది.

మరిన్ని వార్తలు