నేనే చీఫ్ కమాండర్: సీఎం

29 Sep, 2016 04:00 IST|Sakshi
నేనే చీఫ్ కమాండర్: సీఎం

నా ఆధ్వర్యంలోనే కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్ పనిచేస్తుంది
 
 సాక్షి, అమరావతి: కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఇకపై కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్‌గా మారుస్తామని, దీనికి తానే చీఫ్ కమాండర్‌గా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇకపై ఈ సెంటర్ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో భాగంగా ఉంటుందన్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాల్లోనూ ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అత్యవసర, సంక్షోభ సమయాల్లో మాత్రమేగాక రియల్‌టైమ్ గవర్నెన్స్‌కూ ఇవి ఉపయోగపడతాయన్నారు. విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల రెండురోజుల సమావేశంలో మొదటిరోజైన బుధవారం ఆయన మాట్లాడారు. తమ పాలనలో నూటికి 80 శాతం మంది ఆనందంగా ఉండాలని, ఇందుకోసం అన్నిరకాల సర్టిఫికెట్లను రియల్‌టైమ్‌లో అవినీతి లేకుండా ఇవ్వాలని సీఎం సూచించారు.    ఇకపై జరిగే కలెక్టర్ల సమావేశాలకు బ్యాంకర్లూ వస్తారని, రుణాలు ఎందుకివ్వరో అప్పుడే తేలుతుందని చెప్పారు.  గతేడాది తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటులో ముందుందని సీఎం చెప్పారు. కాగా, బ్యాంకుల నుంచి రైతుల తీసుకున్న రుణాల వసూలుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందిస్తుందని తెలిపారు.

 పనితీరులో తూర్పు, ప్రకాశం ఫస్ట్!
 ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కనబరిచిన పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేటింగ్‌లు ఇచ్చింది. ఇందులో తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలు మొదటి స్థానంలో ఉండగా శ్రీకాకుళం జిల్లా ఎప్పటి మాదిరిగానే ఆఖరి స్థానంలో నిలిచింది. కలెక్టర్ల సమావేశంలో ఈ వివరాలను ప్రణాళికా శాఖ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు