ఐపీ.. బాంబులు

5 Sep, 2014 03:44 IST|Sakshi

పసిడిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో బంగారు వ్యాపారులు ఐపీ పెడుతుండడంతో రుణదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏకంగా కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పెట్టాబేడా సర్దుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు ఐపీ పెడతారోననే ఖాతాదారులు భయపడుతున్నారు. కొందరు బంగారు దుకాణాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు.
 
 పసిడి పురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం ఐపీ బాంబులతో వణికిపోతోంది. మార్కెట్‌లో బాగా పేరున్న వ్యాపారులే ఐపీ బాట పట్టడంతో రుణదాతలు ఆందోళన చెందుతున్నారు.వ్యాపారులు వరుసగా దివాళా తీస్తుండటం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. ఈ ప్రభావం బంగారు వ్యాపారంపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
 
 ప్రొద్దుటూరు క్రైం: నాలుగు రోజుల కిందట పట్టణంలోని మెయిన్‌బజార్‌లో కరిష్మా జ్యూవెలర్స్ దుకాణ యజమానులు రూ. 7.50 కోట్లకు ఐపీ పెట్టారు. మరికొందరు అదే బాటలో పయనిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రొద్దుటూరు బంగారం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది.
 
 ఇక్కడ ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం జరుగుతోంది. రాయలసీమతో పాటు ఇతర జిల్లాల వాసులు కూడా ఇక్కడి బంగారు కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు మెయిన్‌బజార్‌లో మాత్రమే ఉన్న దుకాణాలు ఇప్పుడు నాలుగైదు వీధులకు విస్తరించాయి. ప్రస్తుతం మోక్షగుండం వీధి, పాత మార్కెట్, రాజబాటవీధి, కోటవీధి, దర్గాబజార్ తదితర వీధుల్లో దుకాణాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా  బంగారు వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్నారు.
 
 నమ్మకం పోతోంది...
 బజార్‌లో చాలా మంది నమ్మకమే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసేవారు. కొన్ని నెలల వరకూ చెన్నై, సేలం, కోయంబత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేవారు. తమ వద్ద నున్న బంగారు వస్తువులు పట్టణంలోని దుకాణాలకు వేసి కొన్ని రోజుల తర్వాత వచ్చి డబ్బు తీసుకెళ్లేవారు.  అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బయటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానికంగా ఉన్న బంగారు దుకాణాలకు ఒక్క నగ కూడా ఇవ్వడం లేదు. డబ్బు ఇస్తే గానీ వారు నగలు ఇవ్వడం లేదు. దీనికి ఇటీవల కాలంలో చాలా మంది వ్యాపారులు ఐపీ పెట్టడమే కారణమని తెలుస్తోంది.
 
 బంగారు దుకాణం వద్ద ఆందోళన
 మోక్షగుండం వీధిలోని శ్రీనివాసా జ్యువెలరీ షాపు, కటింగ్ మిషన్ వద్ద గురువారం పలువురు వ్యక్తులు గుమికూడారు. షాపు యజమానులు మన్నేపల్లి వేణు, శివకుమార్‌లు తమకు డబ్బు ఇవ్వాలంటూ పలువురు రుణదాతలు దుకాణం వద్ద గుమికూడారు. చీటీల వ్యాపారులు, కార్పొరేషన్, బంగారు నగల తయారీ దారులతో పాటు 22 మందికి దుకాణ దారులు సుమారు రూ. 1.50 కోట్లు దాకా ఇవ్వాలని ఆందోళన కారులు తెలిపారు. మిట్టమడి వీధిలో ఉన్న  ఇంటిని ఇది వరకే విక్రయించారని వారన్నారు.
 
  పెద్ద మనుషులు పంచాయితీ చేసి రూ 60 లక్షలు రుణ దాతలకు ఇచ్చేలా పంచాయతీ చేశారన్నారు. వేణు, శివకుమార్‌లు మాత్రం డబ్బు ఇవ్వకుండా ఐపీ దాఖలు చేసే యోచనలో ఉన్నారని వారు పేర్కొన్నారు. విషయం తెలియడంతో వేణు, శివకుమార్‌లు వన్‌టౌన్ పోలీస్టేషన్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న బాకీదారులు స్టేషన్ వద్దకు వెళ్లి డబ్బు ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరారు.
 
 మరో నలుగురు ఐపీ !
 పట్టణంలో మరో నలుగురు బంగారు వ్యాపారులు ఐపీ పెట్టే యోచనలో ఉన్నట్లు మెయిన్‌బజార్‌లో  చర్చించుకుంటున్నారు. ఓ బంగారు వ్యాపారి ఇప్పటికే రూ.25 కోట్లకు ఐపీ సిద్ధం చేసుకోగా మరో ము గ్గురు తొందరలోనే ఐపీ బాంబు పేల్చనున్నట్లు సమాచారం. మెయిన్‌బజార్‌లో ఒకరు, పాత మార్కెట్ ప్రాంతంలో మరో ఇద్దరు వ్యాపారులు ఐపీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 

మరిన్ని వార్తలు