కొలువు వేటకు మార్గాలివి..! | Sakshi
Sakshi News home page

కొలువు వేటకు మార్గాలివి..!

Published Fri, Sep 5 2014 3:24 AM

కొలువు వేటకు మార్గాలివి..!

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కోరుకున్న ఉద్యోగంలో చేరిపోవడం అనుకున్నంత సులభం కాదు. మార్కెట్‌లో ఉద్యోగావకాశాలు విస్తృతమవుతున్నప్పటికీ పోటీ కూడా అంతేస్థాయిలో పెరిగిపోతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోరుకున్న ఉద్యోగం పొందాలంటే అలుపెరుగక శ్రమించాల్సిందే. జాబ్ సెర్చ్‌కు ఊహించినదానికంటే ఎక్కువ కాలమే పడుతుంది. అయినా నిరాశ చెందకుండా ప్రయత్నాలను కొనసాగించాలి. అభ్యర్థులు అందుకు ముందుగానే మానసికంగా సిద్ధపడాలి. కొలువు వేటలో మునిగినవారు కొన్ని మెలకువలను పాటిస్తే సులువుగా విజయం సాధించొచ్చు. ఉద్యోగస్థుడిగా కెరీర్‌ను ప్రారంభించొచ్చు.
 
 సన్నద్ధత:
 పోటీ తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. కాబట్టి కార్యాచరణ, సన్నద్ధత(ప్రిపరేషన్) కూడా అదేస్థాయిలో ఉండాలి. మీ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోండి. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? ఎందులో రాణిస్తారు? అనే విషయం తెలుసుకోండి. మీ అంచనాలను బట్టి మీరు పనిచేయాలనుకుంటున్న సంస్థల జాబితాను తయారు చేసుకోండి. ఆయా సంస్థల వ్యాపార కార్యకలాపాలు, అందులో బాధ్యతల గురించి పరిశోధించండి. తదనుగుణంగా ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వాలి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.  
 
 ఆకట్టుకొనే కవర్ లెటర్:  
 ఇంటర్వ్యూకు సిద్ధమైన తర్వాత మీ వివరాలతో కూడిన మంచి కవర్ లెటర్‌ను రూపొందించుకోవాలి. దీన్ని దరఖాస్తుతోపాటు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్ మొదట కవర్ లెటర్‌నే చూస్తారు. ఇది వారిని ఆకట్టుకుంటే సగం పని పూర్తయినట్లే. మీ అర్హతలు, అనుభవం వంటి వాటిని ఇందులో క్లుప్తంగా ప్రస్తావించండి. ఉద్యోగానికి మీరు నూటికి నూరు శాతం తగిన అభ్యర్థి అనే విషయం ఈ లెటర్ ద్వారా రిక్రూటర్‌కు తెలియాలి.
 
 డైనమిక్ రెజ్యూమె:
 మిమ్మల్ని మీరు ఒక ఉత్పత్తి(ప్రొడక్ట్)గా భావించుకోండి. మిమ్మల్ని మార్కెట్ చేసేది.. రెజ్యూమె. మీ అనుభవాలు, అర్హతలు, సాధించిన విజయాలు, బలాలను ఇందులో పొందుపర్చండి. దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి అవసరమైన అంశాలను వరుస క్రమంలో వివరించండి. రిక్రూటర్లు అభ్యర్థుల రెజ్యూమెలను చదవడానికి ఎక్కువ సమయం వెచ్చించలేరు. కనుక ఇది తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం ఇచ్చేలా ఉండాలి.
 
 ఇంటర్వ్యూ నైపుణ్యాలు:

 ప్రిపరేషన్, కవర్ లెటర్, రెజ్యూమె.. ఈ మూడూ అభ్యర్థిని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకెళ్లడం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఉద్యోగం సాధించగలరా? లేదా? అనేది ఇంటర్వ్యూలోనే తెలిసిపోతుంది. మౌఖిక పరీక్షలో రిక్రూటర్‌ను మెప్పిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్‌గా కనిపించే వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగిస్తూ ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కొంటే ఉద్యోగం దక్కించుకోవడం సులువే.
 
 ఫాలో-అప్
 మౌఖిక పరీక్ష పూర్తయిన తర్వాత కూడా వీలును బట్టి కంపెనీతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. ఇంటర్వ్యూ స్టేటస్‌ను తెలుసుకోవడానికి సంస్థకు ఈ-మెయిళ్లు పంపాలి. అవసరమైతే ఫోన్ చేస్తుండాలి. దీనివల్ల ఉద్యోగంపై మీలో నిజంగా ఆసక్తి ఉందనే విషయాన్ని రిక్రూటర్ గుర్తిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి కొలువు కావాలంటే అభ్యర్థుల్లో ఓపిక, సహనం ఉండాలి. అంకితభావంతో పనిచేయాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement