పార్టీని వీడే ప్రసక్తే లేదు

5 Jan, 2014 06:07 IST|Sakshi


 సత్తుపల్లి, న్యూస్‌లైన్:
 తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని  ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  సత్తుపల్లిలోని పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి ఆ పార్టీ ఖమ్మంపార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్‌ఆర్ సీపీకి రాజీనామా చేసినట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో స్క్రోలింగ్స్ రావటం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని,  కనీసం తనతో సంప్రదించకుండా స్క్రోలింగ్స్ వేయటం దారుణమని  శ్రీనివాసరావు అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఈవిధమైన అసత్య ప్రచారానికి పూనుకున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.  పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.  శనివారం మధ్యాహ్నం వరకు పార్టీ రాష్ట్రకమిటీ పిలుపునిచ్చిన కార్యక్రమాలలో పాల్గొనటమే కాక.. పార్టీ సంస్థాగత కార్యక్రమాలలో బిజీగా గడిపినట్లు తెలిపారు.
 
 రాజకీయ పార్టీలో టిక్కెట్ ఆశించేవారు నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఉండటం సహజమని,  గెలుపు అవకాశాలు ఉండేవారికే  పార్టీ టిక్కెట్ కేటాయిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. పార్టీలో అందరికి టిక్కెట్లు ఇవ్వటం సాధ్యం కాదని, టిక్కెట్ రానివారికి ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇస్తామని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ సమావేశాలలో చెప్పారని పేర్కొన్నారు. సీటు వచ్చినా.. రాకపోయినా.. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, జిల్లా పార్టీ కన్వీనర్‌గా తన వంతు బాధ్యతలను నెరవేరుస్తానని మచ్చా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తలు మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావ్, పార్టీ నాయకులు మలిరెడ్డి మురళీరెడ్డి, ఎస్‌కె మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు