ఆపరేషన్‌ ముస్కాన్‌లో 3,636 మంది బాలల గుర్తింపు

5 Jan, 2020 05:50 IST|Sakshi
ఆపరేషన్‌ ముస్కాన్‌లో గుర్తించిన బాల, బాలికలతో చిత్తూరు ఎస్‌పీ సెంథిల్‌ కుమార్‌

3,039 మంది బాలురు, 597 మంది బాలికలను రక్షించిన పోలీసులు

నేడు కూడా తనిఖీలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు శనివారం ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించి 3,636 మంది బాలబాలికలను రక్షించారు. వీరిలో బాలురు 3,039 మంది, బాలికలు 597 మంది ఉన్నారు. రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు రెండురోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం ఈ ఆపరేషన్‌లో పోలీసులతోపాటు మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, క్రీడా శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కమిటీలు కూడా భాగస్వాములయ్యాయి. ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, జనసామర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను తనిఖీ చేసి చిన్నారులను గుర్తించాయి.

ఆపరేషన్‌ ముస్కాన్‌ అంటే..
తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చినవారు మరికొందరు అనాథల్లా జీవితం గడుపుతుంటారు. ఇలాంటివారిని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో బహిరంగ ప్రదేశాల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాన్నే ఆపరేషన్‌ ముస్కాన్‌ అంటారు.

ఆపరేషన్‌ ముస్కాన్‌ ఇలా..
- ఈ కార్యక్రమం కోసం ప్రతి సబ్‌ డివిజన్‌లో ఒక ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ఒక మహిళ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టారు.
బృంద సభ్యులు పోలీస్‌ యూనిఫాం ధరించకుండా సివిల్‌ డ్రస్‌లో ఉంటారు.
​​​​​​​- తనిఖీల సందర్భంగా గుర్తించిన పిల్లల ఫొటోలతో కూడిన సమాచారాన్ని చైల్డ్‌ ట్రాక్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. 
​​​​​​​- గుర్తించిన పిల్లలను 24 గంటల్లోపు ఆయా జిల్లాల్లోని శిశు సంరక్షణ కమిటీలకు అప్పగిస్తారు.  
​​​​​​​- సరైన చిరునామా లభించని పిల్లలను షెల్టర్‌ హోమ్‌లలో ఉంచుతారు.
​​​​​​​- హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో బాల కార్మికులు దొరికినట్లైతే యజమానులపై బాలకార్మిక నిషేధ చట్టం, వెట్టిచాకిరి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. 

>
మరిన్ని వార్తలు