ఆయిల్‌ఫెడ్ సొమ్ము అక్రమార్కుల పాలు

18 May, 2015 01:42 IST|Sakshi
ఆయిల్‌ఫెడ్ సొమ్ము అక్రమార్కుల పాలు

*  పేరుకుపోయిన రూ. 7.68 కోట్ల బకాయిలు
* అందులో చెక్‌బౌన్స్‌తో రూ. 2.6 కోట్లు ముంచిన ఓ కంపెనీ
* అశ్వారావుపేట ఫ్యాక్టరీ క్రూడ్ ఆయిల్‌లో భారీ మోసాలు
* ముడిచమురు వెలికితీత
* తక్కువ చూపిస్తూ రైతు నోట్లో మట్టి
 
 సాక్షి, హైదరాబాద్: ఏపీ ఆయిల్‌ఫెడ్ సొమ్మును కొందరు డీలర్లు, అధికారులు అడ్డంగా తినేస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఒకవైపు వంట నూనె కల్తీతోపాటు ఆయిల్‌ఫాం క్రషింగ్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే ముడిచమురులోనూ భారీ మోసాలు జరుగుతున్నా యి. దీంతో రూ. కోట్లు పక్కదారి పడుతున్నాయి. డీలర్లు, అధికారులు కుమ్మక్కై రైతులకు దక్కాల్సిన లాభాలను కొల్లగొడుతున్నారు. కల్తీనూనెతో  ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
 
 నిబంధనలకు తిలోదకాలు
 ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఆయిల్‌ఫాం క్రషింగ్ ఫ్యాక్టరీల నుంచి యానాంకు చెందిన ఒక ప్రైవేటు ఆయిల్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్‌కు గత ఏడాది ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 20 వరకు ముడిచమురు అమ్మారు. దాని విలువ రూ. 3.86 కోట్లు. ఇందుకోసం ఆ కంపెనీ జారీ చేసిన చెక్కుల్లో రూ. 1.26 కోట్లే జమ అయింది. మిగిలిన రూ. 2.6 కోట్ల చెక్‌లు బౌన్స్ అయ్యాయి. చివరకు కంపెనీ చే తులు ఎత్తేసింది. చెక్‌లు పాసయ్యాకే ముడిచమురు విక్రయించాలన్న నిబంధనకు తిలోదకాలు ఇచ్చారు. 2003లో 9 మంది డీలర్లకు ముందస్తు అడ్వాన్సు లేకుండానే రూ. 5.18 కోట్ల విలువైన విజయ ఆయిల్‌ను అమ్మకం కోసం ఇచ్చారు. కానీ వారి నుంచి ఇప్పటివరకు ఆ బకాయిలు వసూలు చేయలేదు. వడ్డీతో కలిపి ఆ సొమ్ము రూ. 15 కోట్లు అయి ఉంటుందని అంచనా. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ఆయిల్‌ఫాం ఆయిల్ మిల్లుకు రెండేళ్ల క్రితం రూ. 4 కోట్లతో ‘దస్క్’ అనే  యంత్ర పరికరాన్ని కొన్నారు. క్రూడ్ ఆయిల్ తక్కువ వస్తుందని రైతులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాన్ని పక్కన పెట్టేశారు. రెండేళ్లుగా మూలన పడటంతో రూ. 4 కోట్లు వృథా అయ్యాయి.
 
రైతులు, ఉద్యోగుల నోట్లో మట్టి
 ఆయిల్‌ఫాంలో పామాయిల్ గానుగ ఆడించగా వచ్చే ముడిచమురు సాధారణంగా క్వింటాలుకు 19.2 శాతం రావాలి. కానీ అశ్వారావుపేట, పెదవేగి ఫ్యాక్టరీల్లో అది 17-18 శాతం మధ్యే చూపిస్తున్నారు. గింజ శాతం క్వింటాలుకు 12 శాతం రావాలి. అది 6 నుంచి 7 శాతం మధ్యే ఉంటుంది. ఒక శాతం రికవరీ తేడా ఉంటే ఏడాదికి రూ. కోటి తే డా ఉంటుంది. 2013లో ఈ తేడాల కారణంగా రూ. 5.6 కోట్లు తక్కువ రికవరీగా చూపించారు. ఇదంతా పక్కదారి పట్టింది. దీనివల్ల రైతుకు ఇవ్వాల్సిన సేకరణ ధర అత్యంత తక్కువకు పడిపోతుంది. ఇక ఉద్యోగ విరమణ తర్వాత 160 మంది పింఛన్ కోసం ఆయిల్‌ఫెడ్ రూ. 11 కోట్లు, తమ వాటాగా ఉద్యోగులు రూ. 2 కోట్లు ఒక జాతీయ బ్యాంకుకు గత ఏడాది మార్చి 15న చెల్లించారు. బ్యాంకుకు నేరుగా చెల్లిస్తే 8 శాతం కమిషన్ కింద రాయితీ ఇచ్చేవారు. కానీ ఏజెంటు ద్వారా వెళ్లి... కమీషన్ కాజేసేందుకు అతనితో కుమ్మక్కై అధికారులు రూ. 1.04 కోట్లు అదనంగా చెల్లించారు.

మరిన్ని వార్తలు