మత్తు దిగాలి..

26 Aug, 2019 08:43 IST|Sakshi

కొత్త మద్యం పాలసీ అమలుకు కసరత్తు

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులు సమాయత్తం

14 సర్కిళ్లలో 191 ప్రభుత్వ రిటైల్‌ దుకాణాల నిర్వహణ

20 శాతం తగ్గుతున్న షాపులు..  దిగనున్న కిక్కు

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌: ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి శ్రీకారం చుడుతోంది. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు దిశగా అడుగులు వే స్తోంది. అక్టోబర్‌ 1 నుంచి ఈ నూతన విధా నం అమల్లోకి వస్తుంది. ఈ నూతన పాలసీ అమలుకు ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎచ్చెర్లలోని జిల్లా బేవరేజెస్‌ కార్యాలయం, గోదాం నుంచి మద్యం సరఫరా అవుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం మద్యం లైసెన్స్‌డ్‌ దుకాణాల నుంచి బెల్టుషాపులకు సరఫరా ప్రోత్సహిం చింది. తాగునీరు అందని గ్రామాల్లో సైతం మద్యం ఏరులై పారింది. ప్రస్తుతం జిల్లాలో 239 మద్యం షాపులున్నాయి. అవి 20 శాతం తగ్గనున్నాయి.

జిల్లాలోని 14 ఎక్సైజ్‌ శాఖ సర్కిళ్ల పరిధిలో ప్రభుత్వమే 191 మద్యం దుకాణాలను నిర్వహించనుంది. 20 శాతం దుకాణాలు తగ్గుతాయి. సెప్టెంబర్‌ చివరి వారంనాటికి షాపుల గుర్తింపు, ప్రతి షాపులో పనిచేసేందుకు సేల్స్‌ సూపర్‌వైజర్, గార్డులు, షాపు సామర్థ్యం మేరకు ఇద్దరు ముగ్గురు సేల్స్‌ సూపర్‌వైజర్లను నియమిస్తారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడ కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఎంపిక నిర్వహిస్తారు. ప్రతి మద్యం సీసా కొనుగోలుకు రశీదు తప్పనిసరి ఇస్తారు. ప్రభుత్వం పక్కాగా మద్యం రిటైల్‌ షాపులను నిర్వహిస్తుంది.


అక్రమాలకు చరమగీతం..
గత ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్‌ మిక్సింగ్‌ కల్తీ చేయడం, ఎంఆర్‌పీ నిబంధనలు అమలు చేయకపోవటం, మద్యం దుకాణాలో లూజ్‌ సేల్, బెల్టుషాపుల నిర్వహణ విచ్చలవిడిగా సాగాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాల వల్ల ఇటువంటి అక్రమాలకు అవకాశం ఉండదు. ప్రస్తుతం మద్యం దుకాణా లను ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ నుంచి కొత్త మద్యం పాలసీలో ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే అమ్ముతారు. గత ప్రభుత్వ హయాంలో బెల్టు షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండేది. వాస్తవంగా హైకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకూడదు. హైకోర్టు ఆదేశాలను సైతం గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్న విమర్శలున్నాయి. నూతన మద్యం పాలసీలో మద్యం షాపులు 20 శాతం కుదింపు, విచ్చలవిడి మద్యం అమ్మకాల నియంత్రణ, కచ్చితమైన సమయపాలన వంటివి ఉంటాయి.

కసరత్తు ప్రారంభించాం..
నూతన మద్యం పాలసీ అమలుకు కసరత్తు ప్రారంభించాం. అక్టోబర్‌ 1 నుంచి అమలు చేస్తాం. 191 మద్యం రిటైల్‌ దుకాణాలు ప్రారంభిస్తాం. పక్కాగా నిర్వహణ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపులు నిర్వహిస్తాం. సమయపాలన ఉంటుంది. కొనుగోలుకు పక్కా రశీదులు ఇస్తాం. మొదటి దశలో 20 శాతం షాపుల కుదింపు జరుగుతుంది.
–కె.కుమారస్వామి, ఏపీ బేవరేజెస్‌  కార్పొరేషన్‌ జిల్లా డిపో మేనేజర్‌ 

మరిన్ని వార్తలు