ప్రమాదం అంచున ప్రయాణం.

19 Jun, 2014 00:50 IST|Sakshi

 పట్నంబజారు (గుంటూరు) : అధికారులు అన్ని విషయాల్లో నిబంధనలు అంటూ మంకుపట్టు పట్టడం వివేకం అనిపించుకోదు. కొన్నికొన్ని విషయాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నెలవారీ పాసులు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో చెల్లవు. కానీ ఉదయం వేళల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్లే సమయంలో ఉన్న ప్యాసింజర్ సర్వీసులు చాలక ఫుట్‌పాత్‌లపై వేలాడుతూ ప్రమాదం అంచున ప్రయాణం చేస్తుండడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు నగరం పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. కొందరు కళాశాలల బస్సుల్లో వెళుతున్నా... అలా వీలుపడని వారికి ఆర్టీసీ బస్సులే శరణ్యం. ఆటోలైతే మరీ డేంజరు... కదా అని ఆర్టీసీ బస్సు ఎక్కుదామంటే నెలవారీ పాసుల వారికి ఎక్స్‌ప్రెస్ బస్సులు నిషిద్ధం. ఇక గతిలేక ఊపిరాడని రద్దీలో పల్లెవెలుగు బస్సులోనే ప్రయాణం తప్పనిసరి. భావి భారత ఇంజినీర్లకు ఇక్కడ నుంచే కష్టాలు మొదలవుతాయి. ఈ బస్సుల్లో ప్రయాణం దినదినగండమే. ఆ రోజు క్షేమంగా చేరితే చేరినట్టు.
 
చాలీచాలని సర్వీసులు...
 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. నిత్యం వందలాది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు, పాఠశాలలకు వెళుతుంటారు. వీరిలో అత్యధిక శాతం మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. విద్యార్థులు ఫుట్‌పాత్‌లపై నిలబడి ప్రయాణం చేస్తూ ప్రాణాలనే పణంగా పెట్టి ప్రయాణం చేస్తున్నా... పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.  గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిత్యం ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు వందలాది మంది విద్యార్థులు కళాశాలలకు వెళుతుంటారు.

కొంతమంది విద్యార్థులు ఆటోల్లోనూ, మరికొంతమంది కళాశాల బస్సుల్లోనూ  ప్రయాణం చేస్తుండగా, అధిక శాతం మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. తెనాలి, న రసరావుపేట, చిలకలూరిపేట, నల్లపాడు, ప్రత్తిపాడు, విజయవాడ ప్రాంతాల్లో అధికంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఉదయం సమయంలో ఆయా ప్రాంతాలకు అధికంగా సర్వీసులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలకు ఆలస్యం అయిపోతోందన్న తొందర్లో ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. పల్లె వెలుగు బస్సుల్లోనే విద్యార్థులను అనుమతిస్తామని చెప్పడం, ఆ సమయంలో పల్లె వెలుగు బస్సు సర్వీసులు సరిపడా ఉండకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
 
అధికారులు చెప్పినా... పట్టించుకోని సిబ్బంది
 ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సైతం కొద్దిమొత్తాన్ని చెల్లించి విద్యార్థులను తీసుకుపోవాలని చెబుతున్నా, సిబ్బంది మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి చెందిన విద్యార్థి ఇలాగే ఫుట్‌పాత్‌పై నిలబడి జారిపడి ప్రాణాలను కోల్పోయాడు. అప్పట్లో విద్యార్థులంతా బైపాస్‌లో రాస్తారోకో నిర్వహించి అధికారుల తీరును ఎండగట్టారు. ప్రత్తిపాడు సమీపంలోని పుల్లడిగుంటలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థి ఫుట్‌పాత్ మీద నుంచి కిందపడి గాయాలపాలైన సంఘటన ఇటీవలి కాలంలోనే జరిగింది.

దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు విద్యార్థులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో బస్సుల సర్వీసులను పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నెలవారీ పాసులు ఉన్న విద్యార్థులను కళాశాలల సమయంలో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ అనుమతి కల్పించాలని కోరుతున్నారు. గతంలో జరిగిన పరిణామాలను చూసైనా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని,  కేవలం ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా, కార్యాచరణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
 
సర్వీసులను పెంచుతున్నాం

విద్యార్థుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలవైపు సర్వీసులను పెంచేందుకు దృష్టి సారిస్తున్నాం. ఇప్పటికే చిలకలూరిపేట మార్గంలో సర్వీసులను అభివృధ్ధి పరిచాం. నరసరావుపేట, తెనాలి, విజయవాడ మార్గాల్లో అధికారుల ద్వారా సర్వే నిర్వహించి సర్వీసుల పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థులను ఎక్స్‌ప్రెస్‌ల్లో అనుమతించని కండక్టర్, డ్రైవర్లపై చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడబోం. ఏడు రూపాయలు చెల్లించి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో విద్యార్థులు ప్రయాణించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో సర్వీసులను అధికం చేయనున్నట్టు  తెలిపారు.
 - పి.వి.రామారావు, ఆర్‌ఎం, ఆర్టీసీ

మరిన్ని వార్తలు