సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించిన జగన్‌

10 Nov, 2023 05:17 IST|Sakshi
కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభలో ప్రసంగిస్తున్న ఎంపీ నందిగం సురేశ్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొన్న ముఖ్యమంత్రి

ఈ వర్గాలను అభివృద్ధిలోకి తెచ్చి సామాజిక సాధికారత సాధించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌

కేబినెట్‌ సహా అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే పెద్ద పీట

మహిళలకు 50 శాతం పదవులు

సీఎం జగన్‌ పాలన ఓ చరిత్రగా నిలిచిపోతుంది

పామర్రు సామాజిక సాధికార బస్సుయాత్ర సభలో మంత్రి జోగి రమేష్‌

పామర్రు: సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే చరిత్ర సృష్టించారని మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, అనేక కార్యక్రమాలతో ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రీ ఈ ఘనత సాధించలేదన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కేబినెట్‌ సహా అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్‌ పెద్ద పీట వేశారని, మహిళలకు 50 శాతం పదవులిచ్చారని అన్నారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఊపిరిగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ని ప్రజా క్షేత్రంలో ఎవరూ ఓడించలేరని, పవన్‌ కళ్యాణ్‌ షణ్ముఖ వ్యూహం, చంద్రబాబు, లోకేశ్, రామోజీ, రాధాకృష్ణతో కలిసి ఎన్ని వ్యూహాలు పన్నినా జగన్‌ ముందు పనిచేయవన్నారు.

చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నారని, సీఎం జగన్‌ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించి చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజ్యసభ సీటిస్తానని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అదే సీటును వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్‌కు అమ్ముకున్నారని తెలిపారు. ఇలా అడుగడుగునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించిన  చంద్రబాబును మరోసారి చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ అక్కున చేర్చుకున్న సీఎం జగన్‌ను మరో­సారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. 

ఉన్నత స్థితికి బడుగు వర్గాలు: మంత్రి నాగార్జున 
మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్‌రామ్, సాహూ మహరాజ్, అబ్దుల్‌ కలామ్‌ వంటి మహానుభావుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థితికి చేరుస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా, రూపాయి లంచం లేకుండా పేదవారి చెంతకు సంక్షేమ పథకాలను చేరుస్తున్నారని అన్నారు.

31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలిచ్చి వారి కుటుంబాలకు గూడు కల్పించిన సీఎంగా దేశంలోనే రికార్డు సృష్టించారన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను, అత్యాధునిక కార్పొరేట్‌ వైద్యాన్ని పేదవారికి అందిస్తున్న ఏకైక సీఎం జగన్‌ అని చెప్పారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పైగా, రుణాలు మాఫీ చేస్తానని రైతులు, మహిళలను మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందుకూ పనికిరారని అవహేళన చేశారని తెలిపారు. మన విలువలు కాపాడుకోవడానికి 2024లో తిరిగి జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  

బాబును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పటికీ క్షమించరు : ఎంపీ సురేష్‌ 
సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబును ఈ వర్గాలు ఎప్పటికీ క్షమించబోవని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. ఆరు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన చంద్రబాబు సోమరిపోతు కాదా అని ప్రశ్నించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వరులు అవుతారని అన్నారు. రూ.370 కోట్లు అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీ ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజం గెలవాలి అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెబుతున్నారని, నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. 

బడుగులను అందలమెక్కిస్తున్న సీఎం జగన్‌:  ఎంపీ మోపిదేవి 
అనేక పథకాలతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం జగన్‌ అందలమెక్కిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై­నారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎ­ది­గేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో పెన్షన్‌ కావాలంటే నాయకులకు దండాలు పెడితేనో, టీడీ­­పీ కండువాలు కప్పుకుంటేనే మంజూరయ్యేదన్నా­రు.

సెంటర్‌లో కనబడి దండం పెట్టకపోతే పెన్షన్‌ రద్దయ్యేదని చెప్పారు. సీఎం జగన్‌ పాలనలో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, సింహాద్రి రమేష్‌ బాబు, పేర్ని నాని, ముస్తాఫా, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు