దోచెయ్

10 Mar, 2016 03:17 IST|Sakshi
దోచెయ్

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో అక్రమాలు
విచారణకు ఆదేశించిన కలెక్టర్
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారినే విచారణకు పంపిన వైనం

 
దీపం ఉండగానే ‘ఇల్లు’ చక్కబెట్టుకోవాలనుకున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారం ఉంది.. ఆపై అధికారి అండా ఉంది. ఇంకేముంది.. అక్రమాలకు యథేచ్ఛగా తెర లేపారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామంటూ ఆర్డీటీ ఇళ్లపక్కన నిలబడి ఫొటోలు తీయించుకున్నారు. వాటిని హౌసింగ్ ఏఈ గుడ్డిగా ఆమోదించారు. 2015 నవంబర్ 7న, డిసెంబర్ 30న ఒక్కొక్కరికి (ఐడీ నంబర్లు : పి 31496959, పి31931994) రూ.41,400 చొప్పున ఇద్దరికి రూ.82,800 మంజూరు చేశారు. మరో 28 మందికి ఇదే తరహాలో బిల్లుల మంజూరుకు రంగం సిద్ధం చేశారు.
 
 
 
తలుపుల : మండలంలోని కాయలపల్లిలో 2008 సంవత్సరంలో ఇందిరమ్మ పథకం కింద 30 మందికి పక్కాగృహాలు మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులు నిర్మించుకోలేదు. కొందరు పునాదులు వేసి వదిలేశారు. ఇదే సమయంలో ఆర్డీటీ గ్రామంలోని నిరుపేదలకు ఇళ్లు నిర్మించేందుకు ముందుకొచ్చింది. సుమారు 50 ఇళ్లను నిర్మించి కాలనీగా ఏర్పాటు చేసింది. కాగా.. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని టీడీపీ నాయకులు రెండేళ్లుగా హౌసింగ్ ఏఈ అశ్వర్థనారాయణపై ఒత్తిడి తెస్తూ వచ్చారు.  ఇందిరమ్మ ఇళ్లు నిర్మించకుండానేబిల్లులు మంజూరు చేయడం కుదరని ఆయన తేల్చిచెప్పారు. ఏఈ అశ్వర్థనారాయణ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కులచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

ఈయనతో టీడీపీ నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చిన బిల్లుల్లో చెరిసగం పంచుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులను అక్కడ ఆర్డీటీ వారు పూర్తి చేసిన ఇళ్ల వద్ద నిలబెట్టి ఫొటోలు తీయించారు. అయితే.. ఆ ఫొటోలను ఆన్‌లైన్‌లో పొందుపర్చలేదు. ఎలాంటి ఇంటి నిర్మాణం చేపట్టకపోయినా గత ఏడాది నవంబర్ ఏడు, డిసెంబర్ 30న ఇద్దరు లబ్ధిదారులకు (ఐడీ నంబర్లు పి 31496959, పి31931994 ) ఒక్కొక్కరికి రూ.41,400 చొప్పున రూ.82,800 మంజూరు చేశారు. మరో 28 మందికి ఇదే తరహాలో బిల్లులు మంజూరు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయితే.. ఈ అవినీతిపై  విచారణ చేపట్టాలని గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు చలపతి నాయుడు ఈ ఏడాది ఫిబ్రవరి 15న కలెక్టరేట్‌లో జరిగిన ‘మీకోసం’లో వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా తిరిగి ఏఈ కులచంద్రారెడ్డినే నియమించారు. దీంతో దొంగ చేతికి తాళాలు ఇచ్చిన చందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. గత నెల 27న ఏఈ కులచంద్రారెడ్డి విచారణకు రాగా.. గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారు.

 ఆరోపణలున్న అధికారినే పంపితే ఎలా ?
 దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా హౌసింగ్ బిల్లులు అక్రమంగా చేసిన అధికారినే విచారణకు పంపితే  నేను ఎందుకు వెళ్లాలి?గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో మండలంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై విచారణకు ఉన్నత స్థాయి అధికారిని నియమిస్తే అంతులేని అవినీతి బయట పడుతుంది. - చలపతి నాయుడు, ఫిర్యాదుదారుడు
 
 ఫిర్యాదుదారుడే విచారణకు రాకుంటే ఎలా ?
 ఆరునెలల క్రితం నేను ఏఈగా విధుల్లో చేరా. డీఈ స్వయంగా వచ్చి నన్ను ఆ గ్రామానికి తీసుకెళ్లారు. ఆయన సూచించిన ఇళ్లకు బిల్లులు చేయమన్నారు. ఆయన ఆదేశాల మేరకు నేను చేశా. హౌసింగ్ బిల్లుల మంజూరులో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుదారుడే విచారణకు రాకపోతే ఎలా?-  ఏఈ కులచంద్రారెడ్డి
 

మరిన్ని వార్తలు