త్వరలో పట్టాలపైకి మెట్రో రైలు ప్రాజెక్టు

24 Nov, 2019 17:14 IST|Sakshi

 విశాఖ నగర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ఏజెన్సీలో మెడికల్, నర్సింగ్‌ కళాశాలలు

స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లాకు అగ్రస్థానం

సంక్షేమ పథకాల అమలులోనూ ముందంజ

ప్రతి పథకం అర్హులందరికీ చేరాలన్నదే లక్ష్యం

విశాఖ సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి ఆశయం

అదే ధ్యేయంతో అహర్నిశలు జిల్లా యంత్రాంగం కృషి 

సాక్షితో జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌

విశాఖ జిల్లాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక దృష్టి ఉంది. జిల్లా, నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ క్రమంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధమవుతోంది. రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. విశాఖ నగరంలో మంచినీటి ఎద్దడి శాశ్వత నివారణకు పక్కా ప్రణాళిక రూపొందించాం. విశాఖ మన్యంలో నర్సింగ్, మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోంది. ఇలా కొత్త కొత్త ప్రాజెక్టులతో త్వరలోనే జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకం జిల్లా వ్యాప్తంగా అర్హులైన అందరికీ అందాలి.. అన్ని వర్గాలకూ న్యాయం జరగాలి.. వెరసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో విశాఖ అగ్రస్థానంలో నిలవాలి. అదే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ స్పష్టం చేశారు.

ఇప్పటికే ప్రజా ఫిర్యాదుల వేదిక అయిన స్పందనలో అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. 11 బృహత్తర పథకాలకు అర్హులను గుర్తించే నవశకం సర్వే కార్యక్రమాన్ని పక్కాగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించేందుకు జిల్లాలో జరిగిన యత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామని.. నిల్వలు పెంచి వినియోగదారులకు కావలసినంత ఇసుక సరఫరా చేస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. శనివారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరును వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

మహరాణిపేట (విశాఖ దక్షిణ): ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల అమలులో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉందని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అన్నారు. స్పందన అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టామన్నారు. ఇసుక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడానికి ఉద్దేశించిన నవశకం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చురుగ్గా జరుగుతోందని తెలిపారు. విశాఖ సమగ్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకా పలు అంశాలపై శనివారం ఆయన సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..

మెట్రో రైలుకు ప్రతిపాదనలు సిద్ధం.. 
శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ మహానగరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెట్రోరైలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. విశాఖలో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తొలి బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో విశాఖ మెట్రో ప్రాజెక్టుపై రూపొందించిన ప్రణాళిక తెరపైకి వచ్చింది. సుమారు 40 మెట్రో స్టేషన్లు నిర్మించి 99 రైళ్లు తిరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేయగా..ఈ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసి మెట్రో రైలుని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు మొదలవుతున్నాయి.

 ఏజెన్సీలో మెడికల్‌ నర్సింగ్‌ కళాశాలలు.. 
పాడేరులో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేశాం. పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోనే 25 ఎకరాల అనువైన స్థలాన్ని గుర్తించాం. ఇటీవలే వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. అరకులో నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ యత్నాలు జరుగుతున్నాయి.

నగరంలో శాశ్వత మంచినీటి పథకం.. 
విశాఖ జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. భవిష్యత్తులో తలెత్తే నీటిఎద్దడి నుంచి నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బృహత్తర ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం జలాశయం నుంచి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు రూ.2,750 కోట్ల అంచనా వ్యయంతో భారీ పైప్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఏలేశ్వరం జలాశయం నుంచి 156 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తారు. భౌగోళిక పరిస్థితులను బట్టి 2.2 నుంచి 2.5 మీటర్ల వ్యాసార్థం ఉన్న పైపులు అమర్చుతారు. అవసరమైన ప్రాంతాల్లో పంప్‌ సెట్స్, సంపులు నిర్మిస్తారు. ప్రతి మండల కేంద్రంలో ఒక ట్యాపింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేయనున్నారు.

గ్రామాలకు, పారిశ్రామిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రోజూ నీటిని అందించేలా ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. రోజుకు 10 నుంచి 15 టీఎంసీల నీటిని ఈ పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ భారీ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా విశాఖ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకూ ఈ నీటిని అందించనున్నారు. ఏలేశ్వరం నుంచి కాకినాడ సెజ్‌కు, తుని మున్సిపాలిటీకి, తూర్పుగోదావరి జిల్లాలోని శివారు గ్రామాలకు ఈ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీటిని అందిస్తారు. విశాఖ జిల్లాలో పైప్‌లైన్‌ వచ్చాక నక్కపల్లి సెజ్‌కు, నక్కపల్లి, పాయకరావుపేట నగర పంచాయతీ, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు, విశాఖ రూరల్‌ మండలాల్లోని అన్ని గ్రామాలకు, మహా విశాఖ నగర పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించనున్నారు.

 సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట.. 
విశాఖలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పెద్ద పీట వేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలను అర్హులకు అందేలా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా రైతు భరోసా, అగ్రిగోల్డ్‌ బాధితులకు సహాయం చేయడం వంటి పనులు విజయవంతంగా చేపట్టాం. ఇప్పడు వైఎస్సార్‌ మత్స్యకార భరోసా అర్హులైన అందరికీ అందేలా పలు చర్యలు చేపట్టాం. అగ్రిగోల్డ్‌ బాధితులకు పదివేల రూపాయలలోపు అందడానికి కృషి చేశాం. బాధితులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇసుక కృత్రిమ కొరతపై ఉక్కుపాదం.. 
జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించడానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు. వాటిని ఎదుర్కొని అవసరం ఉన్న వారికి ఇసుక అందేలా చర్యలు చేపట్టాం. ఎవరైనా ఇసుక కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమాలకు పాల్పడినా, అక్రమ నిల్వలు చేపట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక సమస్య విశాఖలో లేకుండా చర్యలు తీసుకున్నాం. స్పందనలో వచ్చే ప్రతి ఆర్జీదారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నాం. అర్జీదారుల సమస్యను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఓపికతో వింటున్నారు. సీఎం స్ఫూర్తితో విశాఖలో పనిచేస్తున్నాం. ఇదే తరహాలో పనిచేయడం వల్ల విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది.

చురుగ్గా ఇంటింటి సర్వే కార్యక్రమం.. 
వైఎస్సార్‌ నవశకం అమలు కోసం ఇంటింటి సర్వే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. గ్రామం లేదా వార్డు ఒక యూనిట్‌గా తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం. సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, ఇప్పటివరకూ పథకంలో లేని వారి పేర్ల నమోదు ఈ ఇంటింటి సర్వే ప్రధాన ఉద్దేశ్యం. పింఛన్‌కు, ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యానికి, ఉపకార వేతనాలు, కార్పొరేషన్ల రుణాలు పొందడానికి రేషన్‌కార్డు ఒక్కటే ఆధారమవుతోంది.అలాకాకుండా నవశకం పథకంలో ఉండే ప్రతి పథకానికో కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా బియ్యం కార్డు, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు..ఇలా నాలుగు రకాల కార్డులను ప్రత్యేకంగా అందజేయనున్నాం.

ఉగాదికి పట్టాల పంపిణీ.. 
ఉగాది నాటికి జిల్లాలో మూడు లక్షల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా ప్రభుత్వ స్థలాల కోసం అన్వేషణ చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తాం. ఇప్పటికే స్థలాలు సేకరించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. అర్హులైన పేదలందరికీ పట్టాలు, ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ ధ్యేయం మేరకు పనిచేస్తున్నాం.

జనవరి నుంచి పూర్తి స్థాయిలో సచివాలయ వ్యవస్థ.. 
గతంలో ప్రజలు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చేవారు. కానీ ఇప్పడు గ్రామ సచివాలయం ప్రజల వద్దకు వస్తోంది. ఈ వ్యవస్థ ఎంతో గొప్పది. జనవరి నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. అక్కడే అనేక సమస్యలకు పరిష్కారానికి వేదిక అవుతుంది.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి అర్హతల సడలింపు.
దాదాపు ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న సీఎం ఆశయం మేరకు అధికారులు పనిచేస్తున్నారు. 

పటిష్టంగా పర్యవేక్షణ.. 
వైఎస్సార్‌ నవశకం కార్యక్రమం నెల రోజుల పాటు ఒక యజ్ఞంలా సాగుతుంది. ఇంటింటి సర్వేతో మొదలై డిసెంబరు 20న లబ్ధిదారులకు కార్డులు అందజేసే వరకూ పటిష్ట కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కార్యక్రమం ఆద్యంతం పర్యవేక్షణకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాం. జిల్లా స్థాయిలో జిల్లాపరిషత్తు సీఈవో, జాయింట్‌ కలెక్టరు, జాయింట్‌ కలెక్టరు–2 పర్యవేక్షిస్తారు. శాఖల వారీగా జిల్లా పంచాయతీ అధికారి, జీవీఎంసీ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా వైద్యాధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. గ్రామ, వార్డు వలంటీర్లు తాము సర్వే చేసి తీసుకొచ్చిన డేటాను ప్రతి రోజు సాయంత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పగిస్తారు.  

మరిన్ని వార్తలు