అక్రమాలకు ‘మోడల్’!

13 Sep, 2013 01:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూళ్ల)ల్లో ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీలో ఏజెన్సీలు భారీ అక్రమాలకు తెరతీశాయి! రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లాంటి నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు దిగాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు సరిగా అవకాశం ఇవ్వకుండా, ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వకుండానే ముడుపులు మింగుతూ పోస్టును బట్టి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లకు సిద్ధం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 355 మోడల్ స్కూళ్లకుగాను ఈ ఏడాది 321 మోడల్ స్కూళ్లు ప్రారంభించారు. వీటిల్లో ఒక్కో స్కూల్లో 14 పోస్టులను ఔట్‌సోర్సింగ్‌పై భర్తీ చేయాల్సి ఉంది. అందులో భాగంగా తొలుత ఒక్కో స్కూల్లో 3 పోస్టుల చొప్పున 963 పోస్టుల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
 
 ఈ బాధ్యతలను జిల్లాలకు అప్పగించింది. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను తీసుకొని వాటి ద్వారా పోస్టులను భర్తీ చేయాలని పేర్కొంది. ఒక్కో స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఎస్‌యూపీడబ్ల్యూ టీచర్(ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్), యోగా టీచర్, ఫిజికల్ డెరైక్టర్, ఆరు అటెండర్ (అటెండర్, వాచ్‌మెన్), కంప్యూటర్ టీచర్, ప్రోగ్రామర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వెంటనే ప్రతి స్కూల్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్, 1 అటెండర్, 1 వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఔట్‌సోర్సింగ్ సంస్థలను ఎంపిక చేసిన అధికారులు పత్రికా ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను నుంచి దరఖాస్తులను స్వీకరించి, నిబంధనల ప్రకారం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారు. దళారులతో కుమ్మక్కైన ఏజెన్సీలు భారీగా వసూళ్లకు దిగాయి. నిబంధనలు పక్కనబెట్టి కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు రూ. లక్ష వరకు, అటెండరు, వాచ్‌మెన్ పోస్టులకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా