రెవెన్యూ భూములు గందరగోళం

30 Sep, 2019 09:16 IST|Sakshi
భూముల రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీఓ ఓబులేసు, రెవెన్యూ అధికారులు  (ఫైల్‌)  

జిల్లా రెవెన్యూ రికార్డులు గందరగోళంగా తయారయ్యాయి. ఉన్న భూమిని లేనట్లు, లేని భూమి ఉన్నట్లు ఇష్టారీతిన రికార్డులను మార్చివేశారు. ఒకటి కాదు రెండు కాదు వేలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు తారుమారయ్యాయి. దీంతో జిల్లాలో రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమి కంటే దాదాపు 49,352.16 ఎకరాల భూమిని అధికంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. రికార్డుల్లో లేని ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి.

సాక్షి, కందుకూరు(ప్రకాశం) : జిల్లాలో భూముల లెక్కలకు మదర్‌ రికార్డు అయిన ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డుకు, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన భూములకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. జిల్లాలోని 56 మండలాల్లో ఇదే పరిస్థితి. ఒక్క మండలానికి సంబంధించిన రికార్డు కూడా సక్రమంగా లేదు. కొన్ని మండలాల్లో భూములు అధికంగా ఉంటే మరికొన్ని మండలాల్లో రికార్డు కంటే భూములు తక్కువగా ఉన్నాయి. దీంతో రికార్డు ప్రక్షాళన కార్యక్రమానికి కలెక్టర్‌ పోల భాస్కర్‌ లింగసముద్రం మండలం నుంచి శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే. 

► ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డు ప్రకారం ఉండాల్సిన భూమి: 32,90,765.40 ఎకరాలు 
వెబ్‌ల్యాండ్‌లో నమోదు నమోదు చేసిన భూమి: 33,40,117.56 ఎకరాలు

ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం 32,90,765.40 లక్షల ఎకరాల భూమి: 
ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డు ప్రకారం జిల్లాలో అన్ని రకాల భూములు కలుపుకుని 32,90,765.40 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌ ప్రకారం 33,40,117.56 లక్షల ఎకరాలున్నాయి. వెబ్‌ల్యాండ్‌ ప్రకారం జిల్లాలో ప్రభుత్వ భూమి 11,99,686.63 లక్షల ఎకరాలు, ప్రైవేట్‌ భూమి 20,91,689.45 లక్షల ఎకరాలున్నాయి. అలాగే ఇనామ్‌ భూములు 25,886.61 ఎకరాలు, 22854.22 ఎకరాల ఇతర భూములున్నాయి. మొత్తం మీద ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డుకి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన భూములకు మధ్య తేడా 49,352.16 ఎకరాలు అధికంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో లేని భూమిని ఉన్నట్లు చూపించారు. 40 మండలాల రికార్డుల్లో భూములు అధికంగా నమోదు కాగా, మిగిలిన 16 మండలాల రికార్డుల్లో ఉన్న భూమి కంటే తక్కువగా వెబ్‌ల్యాండ్‌లో నమోదైంది. ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డు కంటే అధికంగా భూమి నమోదైన మండలాల జాబితాలో మర్రిపూడి మండలం మొదటి స్థానంలో ఉంది. 33,315.33 ఎకరాల భూమి అధికంగా నమోదైంది. తరువాత స్థానంలో దర్శి 25225.58 ఎకరాలు, కొనకనమిట్ల 24716.61 ఎకరాలు అధికంగా నమోదు చేశారు. ఇక భూములు తక్కువగా నమోదు చేసిన మండలాల్లో కురిచేడు మండలం మొదటి స్థానంలో ఉంది. ఈ మండలంలో వెబ్‌ల్యాండ్‌ ప్రకారం ..

మొత్తం భూములు 730002.89 ఎకరాలు ఉంటే, ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం 1,45,650.43 ఎకరాల భూములున్నాయి. అంటే దాదాపు 72,647.54 ఎకరాల భూములు తక్కువగా నమోదు చేశారు. అంటే ఇక్కడ ఆన్‌లైన్‌ సమస్యలు అధికంగా ఉన్నాయని అర్థమవుతోంది. తరువాత స్థానంలో బేస్తవారిపేట మండలంలో 41,225.16 ఎకరాలు, హనుమంతునిపాడు 18,365.64 ఎకరాల భూములు తక్కువగా నమోదు చేశారు. అలాగే ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డుకు, వెబ్‌ల్యాండ్‌కు దాదాపుగా సమానంగా ఉన్న మండలాలు కూడా ఉన్నాయి. వీటిలో సంతనూతలపాడు 0.48 సెంట్లు, కొరిశపాడు 6.94 ఎకరాలు తక్కువగా ఉంటే, సింగరాయకొండ 26.52 ఎకరాల భూములు అధికంగా ఉన్నాయి. ఈ మూడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల రికార్డులు భారీ స్థాయిలో మార్ఫింగ్‌కు గురయ్యాయి. వందల ఎకరాల భూముల వివరాలు తారుమారయ్యాయి. 

లింగసముద్రంతో ప్రక్షాళన ప్రారంభం: 
ప్రభుత్వ రెవెన్యూ రికార్డు ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కలెక్టర్‌ పోల భాస్కర్‌ ప్రత్యేక శ్రద్ధతో కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూముల రీ సర్వే ప్రారంభించారు. దాదాపు 70 మంది రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ పరిశీలనలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంకు లోన్‌లు పొందిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తమ బండారం బయటపడుతుండడంతో కొందరు అక్రమార్కులు ఏకంగా తహసీల్దార్‌నే చంపుతామని బెదిరింపులకు దిగడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు కేవలం 50 శాతం సర్వే మాత్రమే అధికారులు అక్కడ పూర్తి చేయగలిగారు. అక్రమాలైతే వెలుగులోకి వస్తున్నాయి గానీ వాటిపై చర్యలు ఎంత వరకు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటారా లేదా బ్యాంకుల్లో రుణాలు పొందిన వారిపై చర్యలు ఉంటాయా ఉండవా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ రికార్డులను మార్పుచేయడం అంత సులభరమైన ప్రక్రియేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

క్షేత్రస్థాయి సిబ్బందిదే కీలక పాత్ర: 
ఇలా రికార్డులు తారుమారు కావడంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులతే కీలక పాత్ర అని తెలుస్తోంది. ప్రధానంగా ఆన్‌లైన్‌ ప్రక్రియను అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్ప డుతున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు గుర్తిస్తున్నారు. కొందరు రైతులకు ఉన్న భూమి కంటే ఆన్‌లైన్‌లో అధికంగా నమోదు చేయడం, అడంగల్, 1బి వంటి రికార్డులను మార్చడం, పాస్‌పుస్తకాల్లో అధికంగా భూములు నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీని వల్లే రికార్డుల కంటే అధికంగా భూములు నమోదవుతున్నాయి. ఇలా బ్యాంకుల్లో రుణాలు పొందడం ఇంకా మోసం. ఇలా  కొంత కాలంగా రెవెన్యూ అధికారుల లీలలకు అడ్డూఅదుపు లేకుండా పోవడంతో రికార్డులు మొత్తం గందరగోళంగా తయారయ్యాయి. దీంతో భూ సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీల్లో 90 శాతం భూములకు సంబంధించిన సమస్యలే ఉండడం గమనార్హం. సంవత్సరాలు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే రికార్డులు సక్రమంగా లేకపోవడమే. ప్రస్తుతం ప్రభుత్వం ఈ రికార్డులను సరిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా