జగన్‌ను విమర్శించే హక్కు లేదు

25 Dec, 2014 01:44 IST|Sakshi

లక్ష్మీపురం (గుంటూరు) :  శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే హక్కు టీడీపీ నేతలకు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. సభలో ఓర్పు, సహనంతో మాట్లాడి ప్రజల పక్షాన నిలిచారన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ శాసన సభ్యులు చంద్రబాబు ఆదేశాల మేరకు జగన్ మోహన్‌రెడ్డిని కించపరిచేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించారని మర్రి  మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, విపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డిని ప్రతి సందర్భంలో లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.
 
 సభలో జగన్ ప్రజా సమస్యలపై టీడీపీని  నిలదీసిన తీరును అంతటా మెచ్చుకుంటున్నారని చెప్పారు. స్పీకర్ అతి తక్కువ సమయం ఇచ్చినప్పటికీ రాజధాని రైతులు, కూలీల కోసం పూర్తి పోరాటం చేశారని అన్నారు. ఐకేపీ యానిమేటర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలనూ ప్రస్తావించారన్నారు.
 
 రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగన్  కోరారన్నారు. ఈ సందర్భంలో రైతుల ఆత్మహత్యలను జగన్ ప్రస్తావించి ఆయా కుటుంబాలను ఓదారుస్తానని  చెప్పడంతో భయపడిన ముఖ్యమంత్రి, మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారన్నారు.
 తుళ్లూరులో పంటలు పండించేందుకు నీళ్లు కృష్ణా నుంచి లేదా వేరే చోట నుంచి  రావనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు.
 
 కేసులు మీరే పెట్టించారు....
 ఏ సందర్భం లేకుండా టీడీపీ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులు గురించి ప్రస్తావించడం సిగ్గుచేటని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. అప్పట్లో టీడీపీ నాయకులు కాంగ్రెస్‌తో కుమ్మక్కయి కేసులు పెట్టించిన విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. తిరిగి ఆ కేసులు గురించి మాట్లాడడం దారుణమన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ సేవాదళ్ కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు పాల్గొన్నారు.
 
 మర్రి క్రిస్మస్ శుభాకాంక్షలు
 చిలకలూరిపేట: ప్రేమ, శాంతి, సహనానికి క్రిస్మస్ పండుగ చిహ్నమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. జిల్లాలోని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు బోధనలను పాటించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు